- ఆయన విధేయతను ప్రతిపక్షాలు ప్రశ్నించడం దురదృష్టకరం: అమిత్ షా
- లోక్‌సభ నిబంధనల ప్రకారం స్పీకర్‌దే తుది నిర్ణయమని వ్యాఖ్య
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష సభ్యుల అవిశ్వాస తీర్మానం.. వాయిస్ ఓట్‌తో తిరస్కరించిన సభ
న్యూఢిల్లీ: స్పీకర్‌ను అనుమానించడం అంటే దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానించడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం స్పీకర్‌దే తుది నిర్ణయమని, దాన్ని అనుమానించకూడదని అన్నారు. స్పీకర్ విధేయతను ప్రతిపక్షాలు ప్రశ్నించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్యే బుధవారం జరిగిన వాయిస్ ఓటింగ్‌లో ఈ తీర్మానాన్ని సభ తిరస్కరించింది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. స్పీకర్‌పై ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘‘బీజేపీ సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉంది.. కానీ ఎన్నడూ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటించలేదు. 40 ఏండ్ల తర్వాత ఇలాంటి తీర్మానం రావడం పార్లమెంటరీ రాజకీయాలకు విచారకరం. ఇప్పటివరకు కేవలం 3 సార్లు మాత్రమే ఇలాంటి తీర్మానాలు వచ్చాయి. కానీ ఎన్డీయే ఎప్పుడూ ఇలా చేయలేదు” అని పేర్కొన్నారు. సభ అనేది ఒక జాతర లేదా ఉత్సవం కాదని, ఇక్కడ ప్రతిదీ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. కాగా, దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఒక స్పీకర్‌పై ఇలాంటి తీర్మానం రావడం, అది వీగిపోవడం పార్లమెంటరీ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.
స్పీకర్‌కు అన్ని అధికారాలుంటాయి..
సభలో అన్ పార్లమెంటరీ పదాలను తొలగించడంతోపాటు అన్ని రకాల అధికారాలు స్పీకర్‌కు ఉంటాయని అమిత్ షా అన్నారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. గత 75 ఏండ్లుగా ప్రజాస్వామ్య పునాదులను పార్లమెంట్ పటిష్టం చేసిందని, అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆ విశ్వసనీయతపైనే ప్రశ్నార్థకం చేస్తున్నాయని విమర్శించారు. ప్రివిలేజ్ (విశేషాధికారాలు) భ్రమలో ఉండేవారిని పార్టీ లేదా ప్రజలు కాపాడలేరని, అందుకే వారు (కాంగ్రెస్) ఆదరణ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ స్పీకర్ సీట్‌పైకి ప్రతిపక్షసభ్యులు పేపర్లు విసిరారు. అందరూ లోక్‌సభ నిబంధనలు పాటించాలి. సభలో ఎలా మాట్లాడాలో వారికి శశి థరూర్ నేర్పించాలి. కాంగ్రెస్ నిబంధనలు పార్లమెంటును నడపవు’’ అని అన్నారు.
అహంకారంతోనే తీర్మానం: రవిశంకర్ ప్రసాద్
బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక నాయకుడి ‘అహంకారాన్ని’ సంతృప్తి పరచడం కోసమే స్పీకర్‌ను తొలగించాలనే తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష నేత తన మాటలను ఆచితూచి వాడాలని, ముఖ్యంగా జాతీయ భద్రతలాంటి విషయాల్లో పక్షపాత రాజకీయాలకు తావు ఇవ్వకూడదని హితవు పలికారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలపడంతో గందరగోళం నెలకొన్నది. అనంతరం సభకు అధ్యక్షత వహిస్తున్న దిలీప్ సైకియా, రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు రాహుల్ గాంధీకి అవకాశం కల్పించారు.
