ఢిల్లీలో 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీలో 17వ ఇండియన్  కోఆపరేటివ్ కాంగ్రెస్ సదస్సు..  ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో జులై 1, 2 తేదీల్లో జరగనున్న 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌సీయూఐ) అధ్యక్షుడు దిలీప్ సంఘానీ వెల్లడించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రగతి మైదాన్‌‌లో జరిగే ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ‘‘అమృత్ కాల్–శక్తిమంతమైన ఇండియా కోసం సహకారం ద్వారా శ్రేయస్సు’’అనే థీమ్‌‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారని చెప్పారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మత్స్య, రైతు, మహిళా, యువజన సహకార సంఘాల నుంచి దాదాపు 3,500 మంది పాల్గొంటారని తెలిపారు. 

నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, పపువా న్యూగినియా, ఇరాన్, మలేషియా, ఇతర దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని వెల్లడించారు. వీరితో పాటు ఐసీఏలో సభ్యత్వం పొందిన 34 దేశాల ప్రతినిధులు ఈవెంట్‌‌కు హాజరుకానున్నట్లు చెప్పారు. సహకార శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటైన తర్వాత జరగనున్న ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని దిలీప్‌‌ అన్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ప్రధాని ఈ సమావేశాలకు హాజరువుతున్నారని వివరించారు. ఈ సదస్సులో సహకార రంగం బలోపేతానికి అవసరమైన చట్టం తీసుకొచ్చేందుకు వీలుగా తీర్మానాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.