రూ.2000 నోట్లలో జీపీఎస్ చిప్ ? అమితాబ్ ప్రశ్న వైరల్

రూ.2000 నోట్లలో జీపీఎస్ చిప్ ? అమితాబ్ ప్రశ్న వైరల్

అమితాబ్ యాంకర్ గా వ్యవహరించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’  క్విజ్ కాంపిటీషన్ కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు.  మరో రెండు, మూడు నెలల్లోగా ఈ గ్రాండ్ షో సోనీ టీవీలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో దానికి సంబంధించిన ఒక  ప్రోమో వైరల్ అవుతోంది.  మీడియాలో వచ్చే వార్తలన్నింటిని గుడ్డిగా నమ్మకుండా.. ప్రజలు ఫ్యాక్ట్ చెకింగ్ పైనా దృష్టిసారించాలనే సందేశంతో ఆ ప్రోమో ఉంది. ఇందులో అమితాబ్..   ‘‘ఈ కింది వాటిలో దేనిలో జీపీఎస్ ట్రాకింగ్ చిప్ అమర్చి ఉంది ?’’ అని ప్రశ్నను అడుగుతారు.  ‘టైప్ రైటర్, టెలివిజన్, శాటిలైట్, రూ.2వేల నోటు..’  వీటిలో సరైన ఆప్షన్  ఏదో చెప్పమంటారు.

ప్రశ్నను విని..

ఈ ప్రశ్నను విన్న పోటీదారు క్షణం కూడా ఆలోచించకుండా.. అచంచల ఆత్మవిశ్వాసంతో ‘రూ.2వేల నోటు’ అని బదులిస్తుంది. ‘అది తప్పుడు సమాధానం.. మీరెలా అది సరైన జవాబు అనుకున్నారు ?’ అని  అమితాబ్ ఆమెను ప్రశ్నిస్తారు. ‘నేను మీడియాలో దాని గురించి విన్నాను. అదే నిజమనుకున్నాను’ అని పోటీదారు చెబుతుంది. ‘మీరు విన్నదంతా నిజం అనుకోబట్టే ఈ పోటీలో ఇలా నష్టపోయారు. జ్ఞానం ఎక్కడ దొరికినా తెలుసుకోండి, నేర్చుకోండి.. అంతకంటే ముందు అది నిజమా ? కాదా ? అనేది కూడా వెతుక్కోండి’ అని అమితాబ్ ఇచ్చే సూచనతో ప్రోమో వీడియో ముగుస్తుంది.

పెద్ద నోట్ల రద్దు సమయంలో..

గతంలో (2016 సంవత్సరం)  పెద్ద నోట్లను  రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో.. కొత్తగా రాబోయే రూ.2వేల నోట్లలో జీపీఎస్ చిప్ లను అమరుస్తారనే వదంతి వ్యాపించింది. ఈ చిప్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని ట్రాక్ చేయగలుగుతుందనే తప్పుడు  ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. చివరకు నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఓ విలేకరి దీనిపై ప్రశ్నించారు. ‘మీరెక్కడ విన్నారు దీని గురించి ? నేనైతే ఆ విషయాన్ని ఎన్నడూ వినలేదు’ అని ఆ విలేకరికి నాడు అరుణ్ జైట్లీ బదులిచ్చారు.