V6 News

దండకారణ్యంలో పురాతన తాళపత్రాలు

దండకారణ్యంలో పురాతన తాళపత్రాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్య ప్రాంతంలో పురాతన తాళపత్రాలు వెలుగుచూశాయి. అక్కడి ప్రభుత్వం చేపట్టిన ‘జ్ఞానభారతం’ సర్వేలో భాగంగా వాటిని గుర్తించారు. సర్వే బృందం బస్తర్ జిల్లాలోని బోధన్‌‌పాల్ పంచాయతీ పరిధిలోని కొల్చూర్ గ్రామంలో పర్యటించినప్పుడు ఓ ఇంట్లో తాళపత్రాలు లభించాయి. వీటిలో పూర్వకాలం నాటి వైద్య చికిత్సలు, జ్యోతిష్యం, పారంపరిక జ్ఞానం, జీవనశైలికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

అదే ఇంట్లో కొన్ని పురాతన నాణేలు కూడా లభించాయి. స్థానికుల సహకారంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాళపత్రాలపై పరిశోధన చేసి, వాటిని డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని సర్వే బృందం తెలిపింది.