అగ్ని పర్వతాలు అంటే ఇండోనేషియా లాంటి దేశాలు గుర్తొస్తాయి. కానీ, మన దగ్గర కూడా అగ్నిపర్వతం ఉంది. సంవత్సరం మొత్తం లావా వెదజిమ్ముతూనే ఉంటుంది . ప్రకృతి అందాలతో కనువిందు చేసే అండమాన్ దీవులను ఆనుకొని ఉంది. దీని పేరు బ్యారెన్ ఐల్యాండ్. మన దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఒకే ఒక అగ్ని పర్వతం ఇది.
ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు ఈశాన్యంగా 135 కిలో మీటర్ల దూరంలో బ్యారెన్ దీవి ఉంది. బ్యారెన్ అంటే ‘విడిచి పెట్టిన’ అని అర్థం . ఈ దీవిలో ఎప్పుడు? ఎక్కడ నుంచి లావా ఎగుస్తుందో గుర్తించలేం. గంధకం వాయువు ఉండటం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా ఇక్కడ కష్టం. చెట్లు, పుట్టలు మాడిపోయి దీవంతా బూడిద రంగులో కనిపిస్తుంది . ఆదిమ తెగలే కాకుండా జీవజాలం కూడా లేకపోవడంతో ఈ దీవికి బ్యారెన్ అనే పేరు వచ్చింది . బ్యారెన్ ద్వీపం భారత్-బర్మన్ టెక్టోనిక్ ఫలకంపై అగ్ని పర్వత బెల్ట్ మధ్య ఏర్పడింది. గతంలో కొన్ని రకాల వన్య ప్రాణులు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో అరుదైన అడవి మేక జాతి పెరెల్ ఒకటి. వాటిని ఎన్నో ఏళ్ల క్రితం నౌకా ప్రయాణాల్లో భాగంగా కొందరు నావికులు ఇక్కడ వదిలారనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి పెరెల్ జాతి మేకలు సముద్రపు నీటిని తాగి ఇక్కడ జీవనానికి అలవాటు పడ్డాయి. ఈ దీవుల్లో కొన్ని రకాల పక్షులతో పాటు గబ్బిలాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఇక్కడ ఎక్కువగా జరిగే విస్ఫోటనాలతో అరుదైన వన్యప్రాణులతో పాటు వందలాది సముద్ర జీవులు కనుమరుగవుతున్నాయి.
రెండు కిలోమీటర్ల విస్తీర్ణం
3162.277 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అండమాన్ దీవుల్లో ఈ బ్యారెన్ దీవి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దీవిని పర్యవేక్షించేందుకు కోస్ట్ గార్డులు, నావికా దళాల బోట్లు పని చేస్తుంటాయి. బ్యారెన్ దీవిలో 1787లో మొదటి విస్ఫోటనం జరిగినట్లు చరిత్రకారులు చెబుతారు. దక్షిణ ఆసియా ఖండంలో నిరంతరం రగిలే అగ్ని పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. భారత్ తో పాటు థాయ్ ల్యాండ్, మయన్మార్, ఇండోనేషియా లాంటి దేశాలకు బ్యారెన్ దీవి దగ్గరగా ఉంది. అయితే, విస్ఫోటనాలు లేని సమయంలో స్క్యూబా డైవింగ్ కోసం వచ్చే వాళ్లతో పాటు పర్యాటకులతో ఈ దీవి కళకళలాడుతుంది . దీనికి డైవింగ్ కి అనువైన ప్రదేశంగా కూడా గుర్తింపు ఉంది.
కోటీ ఎనభై లక్షల ఏళ్ల క్రితం..
సుమారు కోటీ ఎనభై లక్షల ఏళ్ల క్రితం బ్యారెన్ దీవి ఏర్పడినట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ముంబై)కి చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల ఆధారంగా తేలింది . 1787 నుంచి 1789, 1795లో ఇక్కడ విస్ఫోటనాలు జరిగాయి. అయితే,1803లో జరిగిన విస్ఫోటనంలో ఉవ్వెత్తున ఎగసిపడిన లావాతో ఆ ప్రాంతమంతా తుడిచిపెట్టుకుపోయింది . తర్వాత1989లో సంభవించిన మరో భారీ విస్ఫోటనం వల్ల బ్యారెన్ దీవి సమీప దీవుల్లో నివసించే జనావాసాలకు తీవ్ర నష్టం కలిగింది. భూకంపాలు ఎక్కువగా వచ్చే తీరప్రాంతానికి అతి సమీపంగా ఉండటమే బ్యారెన్ దీవిలో నిరంతర విస్ఫోటనాలకి కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్యారెన్ దీవిలో కనిపించే అగ్ని పర్వతాల ఆనవాళ్లు హిందు మహా సముద్రం లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ దీవుల వద్ద ఉన్న అగ్ని పర్వతాల్లో 1994 నుంచి 2005 మధ్యకాలంలో రెండు అగ్ని పర్వతాలు పేలడం హిందూ మహాసముద్రం లో సునామీకి కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతారు.
లావాతో పాటు నిప్పురవ్వలు
సాధారణంగా అగ్నిపర్వతాల విస్ఫోటన సమయంలో ఎద్ద ఎత్తున లావా బయటకు వస్తుంది . అయితే, ఈ దీవిలో ఏర్పడే విస్ఫోటనాల్లో లావాతో పాటు నిప్పు రవ్వలు వస్తుంటాయి. 30 సెకన్లకు ఒకసారి పెద్ద పెద్ద శబ్దాలతో లావా పేలుతూ రెండు వందల మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతుంటాయి.
