ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్, నటుడు ధనుష్ మధ్య ప్రస్తుతం నెలకొన్న విభేదాలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ధనుష్‌తో విడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంధం వెనుక ఉన్న అనుబంధం
విఘ్నేష్ శివన్ కెరీర్ ప్రారంభంలో ధనుష్ ఆయనకు ఒక వెన్నుముకగా నిలిచారు. 'వేలై ఇల్లా పట్టాదారి' (VIP) సినిమా సమయంలో విఘ్నేష్ క్రియేటివ్ వర్క్‌లో ధనుష్‌కు సహాయం చేశారు. ఆ పరిచయం కాస్తా బలమైన స్నేహంగా మారింది. ధనుష్ తన స్వంత బ్యానర్ 'వండర్ బార్ ఫిలిమ్స్' ద్వారా 'నానుమ్ రౌడీ దాన్' సినిమాను నిర్మించి విఘ్నేష్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా విఘ్నేష్ కెరీర్‌ను మార్చడమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమలో పడ్డారు. అందుకే ఆ సినిమా అన్నా, ఆ సినిమాకు కారణమైన ధనుష్ అన్నా విఘ్నేష్‌కు ఎనలేని గౌరవం.
తండ్రి లాంటి వ్యక్తితో దూరం..
"నేను నా తండ్రి స్థానంలో ధనుష్‌ను చూస్తాను అని విఘ్నేష్ చెప్పుకొచ్చారు. దానికి ఒక కారణం ఉంది. నా తండ్రి చనిపోయిన రోజు, ధనుష్ సర్ పుట్టినరోజు ఒకటే. అది నాకు ఒక వింత అనుబంధాన్ని ఇచ్చింది. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి వంద శాతం కారణం ధనుష్ . మా మధ్య ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించుకోవచ్చు, కానీ అసలు సమస్యే లేకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య అని భావోద్వేగానికి లోనయ్యారు.
వివాదానికి కారణం ఏంటి?
ఈ భావోద్వేగాల వెనుక ఒక పెద్ద న్యాయపోరాటం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ కోసం 'నానుమ్ రౌడీ దాన్' చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్‌లను వాడటంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫుటేజ్ వాడారని ధనుష్ సుమారు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కారు. తాము రెండేళ్లుగా అనుమతి కోరినా ధనుష్ స్పందించలేదని, వ్యక్తిగత కక్షతోనే ఇలా చేస్తున్నారని నయనతార ఘాటుగా లేఖ రాశారు. జనవరి 2025లో మద్రాస్ హైకోర్టు ధనుష్‌కు మద్దతుగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కేసు విచారణను కొనసాగించింది.
వ్యాపార పరమైన గొడవలు ఒకవైపు, ప్రాణప్రదమైన స్నేహం మరోవైపు.. ఈ రెండింటి మధ్య విఘ్నేష్ శివన్ నలిగిపోతున్నారు. కోపంతో కాకుండా బాధతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, ధనుష్‌తో మళ్లీ పాత రోజులు రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ డైరెక్టర్ ఆవేదనకు ధనుష్ స్పందిస్తారో లేదో చూడాలి.
