గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సాగిస్తున్న వేట ఇప్పుడు కువైట్ తీరానికి చేరింది. కువైట్‌లోని అతిపెద్ద ద్వీపమైన బుబియాన్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా సైనిక స్థావరమే లక్ష్యంగా తాము ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ఖాటమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాకారి ఒక వీడియోలో సోమవారం ధృవీకరించారు. గల్ఫ్ వాయువ్య ప్రాంతంలో ఉన్న ఈ వ్యూహాత్మక ద్వీపంలో అమెరికాకు చెందిన శాటిలైట్ పరికరాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
అమెరికా సైన్యం ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ పక్కాగా పసిగడుతోంది. గతంలో కువైట్‌లోని అరిఫ్జన్ క్యాంప్ పై ఇరాన్ పదేపదే క్షిపణి దాడులు చేయడంతో.. ప్రాణనష్టం తప్పించుకునేందుకు యూఎస్ బలగాలు బుబియాన్ ద్వీపానికి మకాం మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ సైన్యం వారిని వదిలిపెట్టకుండా డ్రోన్లతో వెంటాడి మరీ దాడులు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడిలో అమెరికాకు చెందిన కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.
Also Read : ఉంటే గింటే పర్మినెంట్ చర్చలే ఉండాలి
ఈ దాడుల ప్రభావం కువైట్ సామాన్య ప్రజలపై కూడా పడింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే క్రమంలో.. వాటి శిథిలాలు ఉత్తర కువైట్‌లోని నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఈ ఘటనలో 6 మంది స్థానికులు గాయపడినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం నడుస్తుండగా.. తాజా దాడులు గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని వదిలిపెట్టబోమని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. తాజా దాడులు కూడా ఇదే రుజువు చేస్తున్నాయి.
