గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా ? సోషల్ మీడియా వార్తల్లో నిజం ఏంటంటే ?

గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా ? సోషల్ మీడియా వార్తల్లో నిజం ఏంటంటే ?

గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం గుప్పుమంది. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వార్తలో ఏముందంటే...   ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భనిరోధక మాత్రలను క్యాన్సర్ కారకాలుగా (Group 1 Carcinogens) ప్రకటించింది. వీటిని వాడటం చాలా ప్రమాదం అని ఉంది.  ఇందులో  నిజం ఏంటంటే... ఈ ప్రచారం  పూర్తిగా తప్పుదోవ పట్టించే వార్త. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే....

 WHOకి చెందిన క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC), ఈ గర్భనిరోధక  టాబ్లెట్స్ ని 2005లోనే గ్రూప్ 1 లిస్టులో చేర్చింది. అంటే ఈ విషయం  ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం కాదు, దాదాపు 20 ఏళ్లుగా ఉన్న తెలిసిన సమాచారమే. పరిశోధనల ప్రకారం, ఈ గర్భనిరోధక  టాబ్లెట్స్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కొద్దిగా పెరిగితే, మరికొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

ఈ గర్భనిరోధక  టాబ్లెట్స్ వల్ల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) వచ్చే అవకాశం కొద్దిగా పెరుగుతుంది. అయితే, ఈ మాత్రలు వాడటం ఆపేసిన 10 ఏళ్ల తర్వాత ఈ ముప్పు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

అంతేకాకుండా ఈ  టాబ్లెట్స్ వల్ల అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer), గర్భాశయ క్యాన్సర్ (Endometrial Cancer), పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ముప్పు 30% నుండి 50% వరకు తగ్గుతుంది. ఈ రక్షణ మాత్రలు ఆపేసిన తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు కొనసాగుతుంది.

 డాక్టర్లు ఏమంటున్నారంటే.. ఈ మాత్రలు సురక్షితమైనవే. అవాంఛిత గర్భాలను నిరోధించడంలో ఇవి ఎంతో కీలకం. అయితే, కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్న చరిత్ర ఉంటే మాత్రం, ఈ మాత్రలు వాడే ముందు డాక్టరును సంప్రదించడం తప్పనిసరి.

గర్భనిరోధక మాత్రలను ఏదో ప్రమాదకరమైన విషపూరితమైనవిగా చూడక్కర్లేదు. ఇవి ఒకవైపు రక్షణ ఇస్తూనే, మరోవైపు కొద్దిగా  రిస్క్ తో ఉంటాయి. చాలా మంది మహిళలకు ఇవి సురక్షితమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.