జమైకా: ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ గాయపడిన ఘటన మరవకముందే వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అదే తరహాలో గాయపడ్డాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో భాగంగా జమైకా తలావస్, సెయింట్ లూసియా జౌక్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. జమైకా ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో విల్జోన్ వేసిన బౌన్సర్‌ను రసెల్ పుల్ చేయడంలో మిస్సయ్యాడు. దీంతో బంతి అతని కుడి చెవి భాగంలో హెల్మెట్‌కు బలంగా తాకింది. కుప్పకూలిన రసెల్ తేరుకుని పైకి లేచినప్పటికీ వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే గ్రౌండ్ సిబ్బంది అతన్ని స్ట్రేచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించారు. ఆ తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు రాని రసెల్ స్థానిక ఆస్పత్రికి వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్నాడు. ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జమైకా 170 రన్స్ చేయగా, అనంతరం రకీమ్ కార్న్‌వాల్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 75) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో సెయింట్ లూసియా 16.4 ఓవర్లలోనే 171 రన్స్ చేసి గెలిచింది.

