V6 News

సింగరేణిని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణిని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా, సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నారని ధ్వజమెత్తారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన..  రూ. 60 వేల కోట్ల అప్పుగా ఉన్న తెలంగాణను.. 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని వివేక్  విమర్శించారు.గత పదేళ్లలో సింగరేణి సంస్థను కేవలం ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప, కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని మండిపడ్డారు. కొత్త గనుల కేటాయింపులో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిని గాడిన పెడుతున్నామని.. నేరుగా వేలంలో పాల్గొని కొత్త బొగ్గు గనులను దక్కించుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే రామకృష్ణ పూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 మైన్ మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు.

నాడు సింగరేణికి రావాల్సిన 25 వేల కోట్ల బకాయిలపై నోరు మెదపని కార్మిక సంఘాలు.. నేడు నెలకు 10 కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అట్టర్ ప్లాప్ అని.. అందులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. గతంలో నడ్డా, అమిత్ షా వంటి వారు అవినీతి జరిగిందని ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.