మహారాష్ట్రలో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకే అండర్–-17 మహిళా రెజ్లర్ పేరు మీద రెండు వేర్వేరు రాష్ట్రాల బర్త్ సర్టిఫికెట్లు ఉండటంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఆమెపై వేటు వేసింది. రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆమెను పోటీల నుంచి తప్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మధ్యప్రదేశ్ తరపున మహిళల 57 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఒక యంగ్ రెజ్లర్ వయస్సు, జనన ధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర వ్యత్యాసాలు కనిపించడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు.
అసలేం జరిగింది?:
మొదటి సర్టిఫికెట్ (మధ్యప్రదేశ్): ఇందులో పుట్టిన తేదీ ఆగస్టు 26, 2010 అని ఉంది. కానీ, దీనిని పుట్టిన పదేళ్ల తర్వాత, అంటే నవంబర్ 16, 2021న జారీ చేసినట్లుగా ఉంది. ఇంత ఆలస్యంగా సర్టిఫికెట్ తీసుకోవడంపై అధికారులకు అనుమానం వచ్చింది.
రెండవ సర్టిఫికెట్ (రాజస్థాన్): తండ్రిని వివరణ కోరగా, ఆయన రాజస్థాన్‌కు చెందిన మరో సర్టిఫికెట్‌ను సమర్పించారు. ఇందులో రిజిస్ట్రేషన్ తేదీ సెప్టెంబర్ 1, 2010 అని ఉండగా, దీనిని ఏప్రిల్ 2025లో జారీ చేసినట్లు రికార్డుల్లో ఉంది.
అధికారుల సీరియస్ యాక్షన్:
రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు ఉండటంపై కుటుంబ సభ్యులు వింత వాదనను వినిపించారు. తాము రాష్ట్రం మారినప్పుడు ఆ రాష్ట్రం తరపున ఆడేందుకు వీలుగా కొత్త సర్టిఫికెట్ తీసుకున్నామని వారు చెప్పుకొచ్చారు. కానీ అసలు రికార్డులను తనిఖీ చేయకుండా రెండో రాష్ట్రం సర్టిఫికెట్ ఎలా ఇస్తుందని WFI అధికారులు ప్రశ్నించారు. దీంతో క్రీడల్లో వయస్సు రీత్యా మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు WFI కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రికార్డుల్లో స్పష్టత లేకపోవడంతో సదరు రెజ్లర్‌ను తక్షణమే పోటీల నుంచి తొలగించారు.

