అనిల్‌‌ అంబానీ  దశ తిరుగుతుందా!

అనిల్‌‌ అంబానీ  దశ తిరుగుతుందా!


న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకున్న అనిల్ ధీరుభాయ్ అంబానీ (ఏడీఏజీ)  గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పెరుగుతున్నాయి. రిలయన్స్ నావల్ షేర్ ధర శుక్రవారం అప్పర్ సర్క్యూట్‌‌‌‌ను తాకింది. ఇది గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో  19 శాతం రాబడిని ఇచ్చింది.  సోమవారం సెషన్‌‌‌‌లో మరో 4.30 శాతం పెరిగి రూ. 4.85 వద్ద క్లోజయ్యింది. గత వారంలో15 శాతానికి పైగా లాభాలను ఇచ్చిన రిలయన్స్ ఇన్‌‌‌‌ఫ్రా, సోమవారం కూడా 5 శాతం పెరిగింది. సోమవారం సెషన్‌‌‌‌లో రిలయన్స్‌‌‌‌ పవర్ 5 శాతం, రిలయన్స్ కమ్యునికేషన్‌‌‌‌ 4.35 శాతం, రిలయన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ 4.91 శాతం, రిలయన్స్ హోమ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ 4.71 శాతం లాభపడ్డాయి. నష్టాల్లో కూరుకుపోయిన ఏడీఏజీ కంపెనీల షేర్లు ఇంతగా పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోతున్నారు.  

కీలక నిర్ణయాలు ఉన్నాయి..

ఏడీఏజీ గ్రూప్ షేర్లు పెరగడానికి గల కారణంపై ఆషికా స్టాక్ బ్రోకింగ్‌‌‌‌లోని రీసెర్చ్ - ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీ హెడ్ ఆశుతోష్ మిశ్రా మాట్లాడుతూ "ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీలో ఉన్న చాలా అడాగ్‌‌‌‌ కంపెనీలపై త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ఆర్థికపరమైన కీలక నిర్ణయాలను ఈ కంపెనీలు తీసుకోబోతున్నాయి. లెండర్లకు రావాల్సిన బకాయిల కంటే కంపెనీలకు వచ్చే రికవరీ మొత్తాలు చాలా ఎక్కువగా ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత షేర్ హోల్డర్లకు ఎంతో లాభం ఉంటుంది కాబట్టే ఏడీఏజీ గ్రూప్ షేర్లపై ఆసక్తి పెరుగుతోంది" అని ఆయన వివరించారు. అయినప్పటికీ  తీర్మానం  తుది ఫలితం ఇంకా స్పష్టంగా లేదని, అందువల్ల ఈ ఎత్తుగడల్లో కొన్ని పూర్తిగా ఊహాగానాలేనని చెప్పారు.

రిస్కు ఉంది జాగ్రత్త...

రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లకు సంబంధించి ఇన్వెస్టర్లకు ఏం సలహా ఇస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘సాంకేతికంగా చూస్తే ఈ స్టాక్ మరీ ఎక్కువగా అమ్ముడైన ( ఓవర్‌‌‌‌బాట్ జోన్‌‌‌‌) విభాగంలో ఉంది. కొద్దికాలంలోనే కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పెట్టుబడిదారులు రూ. 110 టార్గెట్ కోసం షేర్లను హోల్డ్ చేయవచ్చు. దీనికి స్టాప్‌‌‌‌లాస్ రూ. 55. కొత్తగా కొనాలనుకుంటే రూ. 68–-65 స్థాయిలో ప్రారంభించవచ్చు. అయినప్పటికీ, ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టాలని మేమైతే రికమెండ్ చేయడం లేదు.  దశల వారీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు చెబుతున్నాం”అని ఆయన వివరించారు. రిలయన్స్ క్యాపిటల్ షేర్ ధరల ర్యాలీపై మాట్లాడుతూ  రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌‌‌‌ అప్పును రూ.9000 కోట్లకు పైగా తగ్గించాలన్న ప్లాన్ కారణంగా ఈ షేరు గత కొన్ని రోజుల నుండి రోజూ అప్పర్ సర్క్యూట్‌‌‌‌ను తాకుతోందని అన్నారు. నెలలో 100 శాతం పెరిగినప్పటికీ ఈ షేరుకు దూరంగా ఉండాలనే చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కంపెనీ హోల్డింగ్‌‌‌‌లో 94 శాతానికి పైగా పబ్లిక్ ఇన్వెస్టర్ల దగ్గర ఉంది.  ప్రమోటర్ల వాటా కేవలం 1.5 శాతం వరకు మాత్రమే ఉంది. రి, రిలయన్స్ పవర్ కూడా గత ఒక నెలలో 100 %  పైగా రాబడిని ఇచ్చింది. కంపెనీ గురించి సానుకూల వార్తలు రావడం ఇందుకు ముఖ్య కారణం. ఫండమెంటల్స్ కంటే ధర ఎక్కువ ఉందని, ఇన్వెస్టర్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. 

ఇన్‌‌‌‌ఫ్రా డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు ప్రయత్నాలు

రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ల ర్యాలీపై ట్రేడిట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అడ్వైజర్ ఫౌండర్ సందీప్ మట్టా మాట్లాడుతూ, "ఈ స్టాక్ గత రెండు నెలల్లో అద్భుత లాభాలను  ఇచ్చింది.  ఫండమెంటల్స్‌‌‌‌ను మెరుగుపర్చడానికి కంపెనీ రెడీగా ఉందని తెలుస్తోంది.  ఏడీఏజీ గ్రూప్  గత కొన్ని సంవత్సరాలుగా అప్పులను బాగా  తగ్గించింది. సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక వనరుల కోసం ప్రమోటర్ల నుంచి, వీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐల నుండి రూ.550 కోట్లను సేకరించాలనే ప్రపోజల్‌‌‌‌ను ఇటీవల రిలయన్స్ ఇన్‌‌‌‌ఫ్రా బోర్డు ఆమోదించింది. ఈ డబ్బును అప్పులు తీర్చడానికి, బిజినెస్ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఉపయోగిస్తారు”అని పేర్కొన్నారు ఆయన.