- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కోఠి, వెలుగు: ఏఎన్ఎం ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. పరీక్షా ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెకండ్ ఏఎన్ఎంల పరీక్షా ఫలితాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్యశాఖ క్యాంపస్ వద్ద ధర్నా నిర్వహించారు. మూడేండ్లుగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్ డబ్ల్యూ) పరీక్షా ఫలితాలు విడుదల చేయకపోవడంపై ఏఎన్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. 2023లో పరీక్షలు నిర్వహించి 2026 వరకు ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు రెగ్యులర్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే, ఫలితాల ఆలస్యం వల్ల వారి సేవాకాలం తగ్గిపోతుందని తెలిపారు.

