కుక్క దాడిలో బాలిక మృతి

కుక్క దాడిలో బాలిక మృతి

కుక్క దాడిలో మరో ప్రాణం బలైంది. తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. కొన్ని నెలలుగా కుక్క కాటు కేసులు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. కుక్క కాటుకు 13 ఏళ్ల బాలిక చనిపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల క్రితం 13 సంవత్సరాల అమ్మాయిని ఓ కుక్క కరిచింది. అప్పుడే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది. కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. 

రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు అడుగు ముందుకు పడటం లేదు. వాటి సంతతి పెరుగుతున్నా.. నివారణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట చిన్నారుల నుంచి పెద్దల వరకు కుక్కలదాడిలో గాయపడుతూనే ఉన్నారు. 2023, ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడు..ఆ సందర్భంగా నాలుగు రోజులు అధికారులు హడావుడి చేసి కుక్కలను పట్టకున్నారే తప్ప వాటికి శస్త్ర చికిత్సలు చేసిందీ లేదు. సమస్య మళ్లీ మొదటికి రావడంతో బల్దియాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కల సమస్యలపై సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రోజుకూ వందల్లో ఫిర్యాదులొస్తున్నా 10 శాతం కూడా పరిష్కరించడం లేదు.