భద్రాద్రికొత్తగూడెం/పినపాక, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 9 వేల కోట్లు కావాలని అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్‌తో కలిసి సోమవారం సీతారామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనులు ఆలస్యం కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జూలై నెలాఖరులోగా మారెళ్లపాడు పథకం పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పినపాక నియోజకవర్గ రైతులే సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చారని, వారికి సాగు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాలకు రూ. 4 వేల కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం, భూ సేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయన్నారు. సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతమ్మసాగర్ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీతమ్మసాగర్ పూర్తి అయితే 38 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబాబూబాద్జిల్లాకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, సర్పంచ్ మర్రి సంధ్య ఉన్నారు.
