
నేచురల్ స్టార్ నాని హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అంటే సుందరానికి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
'అంటే సుందరానికి' ట్రైలర్ చూస్తే బలంగా నవ్వించాలని ఫిక్సైనట్లు అనిపించింది ?
కేవలం నవ్వించడమే కాదు అన్నీ రకాల ఎమోషన్స్ ఫీలవుతారు. ఎమోషనల్‌గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది.
ట్రైలర్లో బ్రాహ్మణ, క్రిస్టియన్ లవ్ కనిపించింది కదా.. భారతీ రాజా 'సీతాకోక చిలుక' ప్రేరణ ఉందా ?
లేదండీ. 'సీతాకోక చిలుక'తో సంబంధం లేదు.
నాని లుక్ బారిష్టర్ పార్వతీశంను గుర్తు చేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ?
నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. కథలో ఒక చిన్న ఎపిసోడ్లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సంరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. అంతే తప్ప దానికి కథకి ఎలాంటి సంబంధం లేదు.
'అంటే సుందరానికి' కథ ఎప్పుడు పుట్టింది ?
ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్నా. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం.
నాని ఈ కథ విన్న తర్వాత ఎలా స్పందించారు ?
నాని చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా నిజాయితీ గల కథ. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్ప ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. చాలా హానెస్ట్‌గా వుంటుంది.
ఒక సంప్రదాయవాద సమాజం నుండి బయటికి రావాలనే సందేశం ఇందులో వుంటుందా?
సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ వుండదు. అయితే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో వుంటుంది. ఐతే అది క్లాసులు పీకినట్లు ఉండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీలవుతారు.
నాని ఇప్పటికే చాలా వైవిధ్యమైన పాత్రలు చేశారు కదా.. ఇందులో ఎంత వైవిధ్యంగా చూపించారు?
నాని ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక పెయిన్ వుంటుంది. ప్రతి మాట వెనుక భిన్నమైన లేయర్ ఉంటుంది. అయితే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని ఫన్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని చూడబోతున్నారు.
'అంటే సుందరానికి'లో అంటే ఏమిటో ఇంకా సస్పెన్స్‌లో పెట్టారు కదా?
అవును. టీజర్, ట్రైలర్లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ చివరలో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది కదా. సినిమా అంతా కూడా అంతే ఆసక్తికరంగా వుంటుంది. ఆ అంటే ఏమిటో అనేదే ఇందులో కీలకం. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
మతాలకి సంబంధించిన పాయింట్ టచ్ చేసినప్పుడు వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా.. మరి ఎలా డీల్ చేశారు?
చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్. అయితే ఎవరినీ హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్' యూ' సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇందులో అభ్యంతరకరమైన అంశాలు ఉంటే.. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వదు కదా.
నజ్రియా ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?
లీలా థామస్ పాత్ర చేయడానికి బలమైన పెర్ఫార్మర్ కావాలి. నజ్రియా అయితే ఆ పాత్రకు కరెక్ట్ అని భావించాం. ఆమెని అప్రోచ్ అయితే లక్కీగా ఆమె అంగీకరించింది.
టీజర్ ట్రైలర్ చూస్తుంటే తండ్రి కొడుకుల బాండింగ్ చాలా హిలేరియస్‌గా చూపించినట్లనిపిస్తుంది.. రియల్ లైఫ్ అనుభవాలా?
తండ్రి కొడుకుల బాండింగ్ అందరి లైఫ్‌లో కామన్ కదా( నవ్వుతూ) నాన్నలు తిడతారు. ప్రేమిస్తారు. బాధపడతారు. నాని, నరేష్ పాత్రల్లో అన్ని ఎమోషన్స్ చూస్తారు.
దాదాపు మూడు గంటల రన్ టైం వుంది కదా.. ఇది ఇబ్బంది కాదా ?
రన్ టైం అనేది సమస్య కాదు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన లెంత్. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా వున్నాం. సినిమా చూస్తున్నపుడు ఈ లెంత్ ఫీలవ్వరు. చాలా సరదా హాయిగా గడిచిపోతుంది.
ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు అంటే అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా.. ఇప్పుడు ఇలాంటి కథ చెప్పే అవసరం ఉందా?
ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ వివాహాలకు చాలా అడ్డంకులు వున్నాయి. న్యూస్‌లో రాకపోవడం, వినీవినీ రొటీన్ అయిపోయిందే తప్ప చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నో పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. మేము చాలా హ్యూమరస్ అప్రోచ్‌తో ఈ కథని డీల్ చేశాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
చాలా సీరియస్ పాయింట్లని కూడా వినోదాత్మకంగా చెబుతుంటారు. అది మీ స్టయిల్ అనుకోవచ్చా?
అది మన అప్రోచ్ అండీ. ఒక సీరియస్ విషయాన్ని ఇంకా సీరియస్‌గా ఒకే టోన్ లో చెప్పడం కంటే దాన్ని వినోదాత్మకంగా చెప్పి ఫైనల్‌గా చెప్పాల్సిన పాయింట్ చెబితే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని భావిస్తాను.
నానితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నాని ఎప్పుడూ ఒక స్టార్లా బిహేవ్ చేయలేదు. ఆయన సెట్లో ఉన్నంత సేపు సుందర్లానే ఉండేవారు.అలా ఉన్నపుడు డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. నజ్రియా కూడా అంతే.
'అంటే సుందరానికి' పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా.. సౌత్ కే పరిమితం చేయడానికి కారణం?
'అంటే సుందరానికీ' కథ యూనివర్సల్. కథ రాసినప్పుడే ఇది సౌత్‌కి బాగుంటుందని అనుకున్నాం.
'అంటే సుందరానికి'లో స్పెషల్‌గా ఎలాంటి పాటలు పెట్టినట్లనిపించలేదు.. అన్నీ కథలో భాగమైన సాంగ్స్ లాగానే ఉన్నాయి కదా ?
అవునండీ. ఒక క్యాచి సాంగ్ అద్భుతంగా బయట క్లిక్ అవ్వొచ్చు. నా కథకు సెట్ కాకపోవచ్చు. నాకు కథే ముఖ్యం. కథలో బాగామైన పాటలే వున్నాయి. అందరికీ నచ్చాయి. వీడియోతో చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు.
ఓటీటీల ప్రభావం పెరిగింది కదా.. సినిమాకి కథ చేసి ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం సవాల్ కాదా?
ఇప్పుడున్న పరిస్థితిలో కచ్చితంగా సవాలే. సినిమా థియేటర్లో అందరితో చూసి ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నపుడు ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందించాలని కోరుతున్నాను. 'అంటే సుందరానికి'లో బలమైన కంటెంట్ ఉంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి?
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పని చేయడం గొప్ప అనుభూతి. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు, నేను ఏది అడిగినా ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల సహకారాన్ని మర్చిపోలేను.
ప్రతి సినిమాకి జోనర్ మారుస్తున్నారు కదా?
నన్ను నేను కొత్తగా మలుచుకోవడం కోసమే. నాకు నేను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు చేయాలనే వుంటుంది.
భవిష్యత్ లో ఎలాంటి సినిమా చేయాలని వుంది?
ఒక యాక్షన్ డ్రామా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. తప్పకుండా చేస్తా.
దర్శకుడే రచయిత అవ్వడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుందా?
లేదండీ. అలా ఏం వుండదు. కథలో లోపం వుంటే క్వాలిటీ తగ్గుతుంది కాని దర్శకుడే రచయిత అవ్వడం వల్ల క్వాలిటీ తగ్గడం అంటూ ఉండదు.
కొత్త సినిమా సంగతులు?
కొన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు
ఆల్ ది బెస్ట్
థాంక్స్