- పూజారులపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆగ్రహం
- ఉదయం 7 గంటలకే సికింద్రాబాద్‌లోని సంతోషిమాత ఆలయానికి వెళ్లిన కమిషనర్
- రికార్డుల పరిశీలన, తప్పుల తడకగా ఉండడంతో విచారణకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : గురువారం ఉదయం 7 గంటలు.. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో ఉన్న సంతోషిమాత ఆలయానికి అప్పుడే ఒక్కొక్కరుగా భక్తులు వస్తున్నారు. అదే సమయంలో గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అమ్మవారికి మొక్కిన అనంతరం ఆశీర్వాదం కోసం పూజారి వద్దకు వెళ్లారు. అక్షింతల్లో చీమలు, పురుగులు కనిపించడంతో పూజారిని నిలదీసి, ప్రశ్నల వర్షం కురిపించారు. వచ్చింది దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అని తెలియడంతో పూజారి ఆందోళనకు గురయ్యారు.
ఆలయంలో ఈవో లేకపోవడంతో అక్కడే డ్యూటీ చేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను పిలిచిన కమిషనర్ ... ఆలయంలో నిర్వహించాల్సిన 16 రిజిస్టర్లను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా ? బంగారు, వెండి ఆభరణాల రిజిస్టర్లు ఎక్కడ ? వంటి ప్రశ్నలు వేయడంతో జూనియర్ అసిస్టెంట్ తత్తరపాటుకు గురయ్యారు.
రికార్డుల పరిశీలన.. లెక్కల్లో తప్పుల గుర్తింపు
సంతోషిమాత ఆలయానికి వచ్చిన కమిషనర్ హనుమంతరావు రికార్డులను పరిశీలించారు. దేవాలయ దుకాణ లీజుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఆలయానికి 14 షాపులు ఉండగా.. కొందరు ఓనర్లు లక్షలాది రూపాయలు బాకీ ఉన్నా పట్టించుకోకుండా రెన్యూవల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు దుకాణాలు ఖాళీగా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
రికార్డుల్లో తప్పులు, అక్రమాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణను ఆదేశించారు. భక్తులపై వేసే అక్షింతల్లో పురుగులు, చీమలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
వరుస తనిఖీలు.. హడలిపోతున్న ఉద్యోగులు
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వరుస తనిఖీలతో ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. వారం కింద చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కిలోన్నర వెండితో తయారు చేసిన కిరీటం కనిపించకపోవడం, పలు అవకతవకలు బయటపడడంతో అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉన్న ఈవో రామాంజనేయులును అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.
ఏడేండ్ల కింద ఓ గుడికి వెండి, బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చినప్పటికీ ఇప్పటికీ రసీదు ఇవ్వలేదని ఇటీవల ఓ భక్తురాలు ఆరోపించడంతో ఆ విషయంపై విచారణకు ఆదేశించారు. తాజాగా ఉదయం 7 గంటలకే సంతోషిమాత ఆలయాన్ని తనిఖీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖ సిబ్బంది అలర్ట్ అయ్యారు.

