V6 News

మీ సేవ.. రేట్లు మా ఇష్టం!.. నిర్వాహకుల అదనపు దందా

మీ సేవ.. రేట్లు మా ఇష్టం!.. నిర్వాహకుల అదనపు  దందా
  • కస్టమర్ల నుంచి ఎక్కువగా వసూలు  
  • మూడు, నాలుగు రెట్లు చార్జి 
  • బర్త్, డెత్, క్యాస్ట్ ఏదైనా ఒకటే రేటు 
  • సెంటర్లలో రెగ్యులర్ తనిఖీలు ల్లేవ్ 
  • నామ్​ కే వాస్తేగా సిటిజన్ చార్ట్​లు 
  • పట్టించుకోని బల్దియా ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు : మీ సేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్​కు అప్లయ్ చేసుకున్నా అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదనంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే  పని చేయమని తేల్చి చెబుతున్నారు. అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఇటీవల బర్త్, డెత్ సర్టిఫికెట్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన బల్దియా అధికారులు 200  మీ సేవ కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీతో సిటిజన్​ సేవలను మరింత  సులభతరం చేశామంటూ అన్ని సేవలను మీ సేవకు బదలాయించి అధికారులు చేతులు దులుపు
కోగా నిర్వాహకులకు ఇది వరంగా మారింది. 

ఏ సర్టిఫికెట్ అయినా అంతే.. 

మీసేవ చార్జీల కింద  ఏ సర్టిఫికెట్ కైనా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 45 వసూలు చేయాలి.  జనం అవసరాలను ఆసరాగా చేసుకుని ఒక్కోదానికి రూ. 100, కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. కొందరు అప్లికేషన్ చేసిన సమయంలో కాకుండా ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు  ఎక్కువగా తీసుకుంటున్నారు. కొన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ అప్​డేషన్ సేవల్లో భాగంగా రూ. 150 నుంచి 200, కొన్నిచోట్ల అంతకు రెట్టింపే లాగుతున్నారు. ఇలా అన్ని సర్వీసుల మీద అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆపై.. జిరాక్స్, ఫొటో, ఆధార్ స్కానింగ్​ల పేరిట ఇంకొంత చార్జి ​చేస్తున్నారు. ఇదంతా సెంటర్లలో బహిరంగగానే జరుగుతున్నా సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. సెంటర్ల తనిఖీలు కూడా చేపట్టడడం లేదు. 

సిటిజన్ బోర్డుల్లేవ్  

మీ సేవ సెంటర్లలో  సర్వీసు చార్జీల ధరల పట్టిక(సిటీజన్ చార్ట్) తప్పనిసరిగా ఉండాలి. అయితే, చాలా సెంటర్లు స్పష్టమైన సమాచారంతో చార్ట్​ను ఏర్పాటు చేయలేదు.  ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వసతులు కూడా కల్పించడం లేదు. చార్ట్​లో అక్షరాలు కనిపించకుండా ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మీ సేవ కేంద్రాల్లో తప్ప మిగతా ప్రైవేట్ సెంటర్లలో నిర్ణయించిన ధరల కంటే అదనంగా ఎలాంటి భయం లేకుండానే వసూళ్లకు పాల్పడుతున్నారు. 

3 జిల్లాల్లో వెయ్యికి పైగా సెంటర్లు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో వెయ్యికి పైగా మీ సేవ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్ 436, రంగారెడ్డిలో 297, మేడ్చల్ లో 290 సెంటర్లు ఉండగా.. ఇందులో  కొన్ని ప్రభుత్వానివి కూడా ఉన్నాయి. చాలా సెంటర్ల నిర్వాహకులతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. సర్టిఫికెట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు సకాలంలోనే ఫైల్స్​ పంపినా  కూడా అక్కడ అప్రూవల్​రావడం లేదని కొన్ని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి అదనంగా డబ్బులు ఇవ్వకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. 

ఫిర్యాదు చేస్తే  చర్యలు తీసుకుంటం

మీ సేవ నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటం. నిర్వాహకులు తమ సెంటర్లలో కచ్చితంగా సిటిజన్‌‌‌‌ చార్ట్‌‌‌‌ పెట్టాలి. ప్రభుత్వం నిర్ణయించిన రూల్స్ మేరకు ఫీజు తీసుకోవాలి. అధికంగా వసూలు చేసే వారిపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటం. 1100 లేదా 18004251110 కాల్ సెంటర్ నంబర్లకు, లేదా meesevasupport@telangana.gov.in ఫిర్యాదు చేయవచ్చు.   

వరలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్​(టెక్నికల్, ఫైనాన్స్) మీ సేవ