ఒమిక్రాన్‌పై రూమర్స్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

ఒమిక్రాన్‌పై రూమర్స్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదదైంది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన అతడు నవంబర్ 27న ముంబైకి చేరుకున్నాడు. అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులో ఆయనకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అక్కడి నుంచి వైజాగ్‌కు విమానంలో వచ్చిన అతడికి మరోసారి టెస్టు చేయగా..కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వైద్యాధికారులు పంపించారు. అతడికి ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అయితే  క్వారంటైన్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అతడికి నిన్న కరోనా టెస్టు చేయగా మళ్లీ నెగెటివ్ కూడా వచ్చిందని అధికారులు చెప్పారు. 

ఇదొక్కటే కేసు.. రూమర్స్ వద్దు

అయితే ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించిన కొద్ది గంటల్లోనే తిరుపతిలో మరో ఒమిక్రాన్ కేసు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అటువంటిదేం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. తిరుపతిలో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి రూమర్లు ప్రచారం చేయొద్దని కోరారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.