శ్రీశైలం నీళ్లపై ఏపీ మరో కుట్ర

శ్రీశైలం నీళ్లపై ఏపీ మరో కుట్ర

అప్పర్‌ పెన్నా లిఫ్టులో కొత్తగా నాలుగు అక్రమ ప్రాజెక్టులు

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా నీటి తరలింపు

రానున్న రోజుల్లో మరింత విస్తరించేలా ప్లాన్‌

రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్​

సైలెంట్​గా మన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత ఎక్కువగా నీళ్లను తరలించుకపోయేందుకు కొత్తగా నాలుగు అక్రమ జలాశయాల నిర్మాణానికి ఏపీ రెడీ అయింది. పెన్నా బేసిన్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేందుకు అప్పర్‌ పెన్నార్‌ లిఫ్ట్‌ స్కీంను మరింత విస్తరించబోతుంది.
5 టీఎంసీలు ఏడాది పొడవునా నిల్వ చేయడంతో పాటు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కడుతున్న ఈ రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్‌ బుధవారం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును విస్తరిస్తున్నారు.శ్రీశైలంలోకి చేరే కృష్ణా నీళ్లు మొత్తం మళ్లించేందుకు ఇప్పటికే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌ స్కీంను చేపట్టిన ఏపీ సర్కారు తాజాగా హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌) లిఫ్ట్‌‌‌‌ స్కీంను మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. పెన్నా బేసిన్‌‌‌‌లోని అనంతపురం, కడప జిల్లాలకు నీళ్లు అందించేందుకు ప్రారంభించిన హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌తో రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి నాలుగు రిజర్వాయర్‌‌‌‌లు నిర్మిస్తోంది.

4.92 టీఎంసీల కెపాసిటీ

హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌‌‌‌ ఆధారంగా రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు రిజర్వాయర్‌‌‌‌ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సోమరవాండడ్లపల్లి (1.5 టీఎంసీలు), తోపుదుర్తి (0.95 టీఎంసీలు), ముట్టాల (2.02 టీఎంసీలు), దేవరకొండ (0.90 టీఎంసీలు) రిజర్వాయర్‌‌‌‌లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.592 కోట్లు ఖర్చు చేయనున్నారు. హంద్రీ నీవాలో భాగంగా ఎత్తిపోసే కృష్ణా నీళ్లను మడకశిర బ్రాంచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌ ద్వారా అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌కు తరలిస్తారు. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌‌‌‌లకు నీటిని మళ్లిస్తారు. ఈ యేడాది వానాకాలంలో అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌ (పేరూరు డ్యాం) రిజర్వాయర్‌‌‌‌కు హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ద్వారా కృష్ణా జలాలను మళ్లించారు. డ్యాం కింద 10 వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, దాదాపు సగం విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగు చేశారు. కొత్త రిజర్వాయర్ల కింద ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, బెళుగుప్ప, అనంతపురం రూరల్‌‌‌‌, రాప్తాడు మండలాల్లోని 40 గ్రామాల్లో గల 25 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

1959లో అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌ నిర్మాణం

పెన్నానదిపై 1959లో అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌ (పేరూర్‌‌‌‌) ప్రాజెక్టును నిర్మించారు. 1.81 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌‌‌‌ కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నాటక ఎగువన నాగలమడక ప్రాజెక్టును నిర్మించడంతో అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌లోకి నీళ్లు రావడం లేదని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. పెన్నా నదిలో నీళ్లు రావడం లేదు కాబట్టే శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లను మళ్లిస్తున్నామని పేర్కొంటోంది. ఈ క్రమంలోనే అప్పర్‌‌‌‌ పెన్నార్‌‌‌‌ విస్తరణకు పూనుకుంది. రానున్న రోజుల్లో గరిష్టంగా 40 టీఎంసీల నీటి వినియోగంతో లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్లాన్ చేసింది.

రెస్పాండ్ అవని సర్కారు

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు ఎప్పటిలాగానే సైలెంట్​గా ఉంటోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మాదిరిగానే ప్రజల నుంచి ఒత్తిడి వస్తే తప్ప స్పందించేలా లేదు. సీఎం కేసీఆర్‌‌‌‌ ఏపీ అక్రమ ప్రాజెక్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రతిసారి ప్రభుత్వ తీరు ఉంటోంది. అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి ఆయా విషయాలను తీసుకెళ్తున్నా రెస్పాండ్​ అవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పై ఆధారపడి చేపట్టే అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తోంది.