అలర్ట్.. ఇలాంటి నకిలీ బెట్టింగ్ సైట్లు, యాప్‌లతో జాగ్రత్త

అలర్ట్..  ఇలాంటి నకిలీ బెట్టింగ్ సైట్లు, యాప్‌లతో జాగ్రత్త

ఆన్‌లైన్ బెట్టింగ్ ముసుగులో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.. ముఖ్యంగా Cricbuzz Bet వంటి పేర్లతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

అధిక లాభాలు, భారీ బోనస్‌లు, క్యాష్ రివార్డుల పేరుతో ఈ సైబర్‌ నేరగాళ్లు సామాన్యులను ఊరిస్తున్నారు. ఆ ఆశతో డబ్బులు డిపాజిట్ చేస్తే.. ఇక ఆ డబ్బు తిరిగి రాదని, ఇది పూర్తిగా మోసపూరితమైన నెట్‌వర్క్ అని ఎస్పీ స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం లేదా OTPలను గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని చెప్పారు. నకిలీ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని..ముఖ్యంగా యువత ఇటువంటి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే వ్యామోహంలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు ఎస్పీ.ఆన్‌లైన్ బెట్టింగ్ ,గ్యాంబ్లింగ్ మన దేశంలో చట్టవిరుద్ధం. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ  హెచ్చరించారు.

మీకు ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు లేదా యాప్‌ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు గానీ సమాచారం అందించాలని తెలిపారు.  ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే.. ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.