హైదరాబాద్, వెలుగు: వారాంతాలు లేకుండా పనిచేస్తున్న పోలీసుల పుట్టిన రోజు,పెళ్లిరోజులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈమేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయని, వీటిని ప్రత్యేక సెలవులుగా పరిగణించాలని పేర్కొన్నారు.
సిబ్బంది తమ పుట్టినరోజు లేదంటే వివాహ వార్షికోత్సవానికి ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)కు గాని, పై అధికారులకుగాని సమాచారం అందించి, సెలవును పొందాలని సూచించారు. ఒకవేళ అత్యవసర విధుల్లో ఉండి ఆ రోజు సెలవు తీసుకోలేకపోతే, దానిని తర్వాతి రోజు వాడుకునే వెసులుబాటు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సెలవులు పోలీసుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

