నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మే నెలలో కృష్ణా నృష్ణా బోర్డు (KRMB) సమావేశంలో ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు, తెలంగాణకు 15 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే ఏపీ తనకు కేటాయించిన 10 టీఎంసీల నీటిని ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుంది.
ఈ తరుణంలో కృష్ణా నృష్ణా బోర్డు (KRMB) ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ, ఏపీ ఇరిగేషన్ , జెన్కో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. కుడి కాలువ పవర్‌హౌస్ ద్వారా ఏకంగా 1600 క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు.
మరోవైపు, తెలంగాణకు ఇంకా నీటి వాటా మిగిలి ఉండటంతో.. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ వాటాలో భాగంగా ఎడమ కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.నిబంధనలకు విరుద్ధంగా, బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీటిని విడుదల చేయడంపై ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగింది.
