- ఢిల్లీ నుంచి హైబ్రిడ్ మోడ్‌లో గవర్నింగ్ బాడీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి(జీసీ) నదుల అనుసంధాన ప్రక్రియను తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నుంచే చేపట్టాలని ఏపీ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అధ్యక్షతన జరిగిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 76వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఏపీ తన వాదనను వినిపించింది. ఢిల్లీ నుంచి హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన ఈ సమావేశంలో రివర్ లింక్ ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘ చర్చ జరిగింది.
నేషనల్ పర్‌స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)లో భాగంగా చేపట్టిన 17 ప్రాజెక్టుల స్థితిగతులను సమావేశంలో సమీక్షించారు. మహానది-గోదావరి లింక్‌పై చర్చ సందర్భంగా గోదావరి-కావేరి (జీసీ) అనుసంధానం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ.. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచే జీసీ లింకును చేపట్టాలని, అప్పుడే తాము అంగీకరిస్తామని స్పష్టం చేసింది. తాను నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును కూడా ఏపీ ప్రస్తావించింది. అయితే, ఈ అంశంపై ఇప్పుడు చర్చ అనవసరమని, ప్రత్యేక సంప్రదింపుల సమావేశంలో చర్చిద్దామని ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది.
కర్నాటక కొత్త ప్రతిపాదన
మరోవైపు కర్నాటక ప్రభుత్వం కూడా జీసీ లింకుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయిస్తున్న 16 టీఎంసీల నీటిని ఆల్మట్టి డ్యామ్ ద్వారా వినియోగించుకుంటామని తెలిపింది. దీనికి అనుగుణంగా బెడ్తి-వర్ధా లింకును జీసీ లింకు నుంచి తొలగించాలని, దీనిపై విడిగా అంచనాలు, ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.నదుల అనుసంధానానికి సంబంధించి రాష్ట్రాల అభ్యంతరాలు, ప్రతిపాదనలపై తదుపరి కన్సల్టెన్సీ సమావేశాల్లో చర్చించాలని ఎన్‌డబ్ల్యూడీఏ సూచించింది. ఈ సమావేశంలో 2025~26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు, 2026~27 సంవత్సరానికి గానూ రూ. 95 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించారు. సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ బాలేశ్వర్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.
