విభజనతో మాకు చారిత్రక అన్యాయం...కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదన

విభజనతో మాకు చారిత్రక అన్యాయం...కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదన
  •      హైదరాబాద్‌‌‌‌తో తెలంగాణకే లాభం జరిగింది
  •      రాష్ట్ర విభజనను సమానంగా చేయలేదు
  •     మళ్లీ మొదట్నుంచి కేటాయింపులు చేయడానికి లేదు
  •     ఇప్పటికే ఉన్న వాటికి రక్షణ కల్పించాలి
  •     ఔట్​సైడ్​ బేసిన్‌‌‌‌కూ నీటి తరలింపులు లీగల్.. వాటికీ రక్షణ ఇవ్వాలని డిమాండ్ 
  •     రేపటి నుంచి ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వివరణలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజనతో తమకు చారిత్రక అన్యాయం జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం అడ్డగోలు వాదనలకు తెరతీసింది. అన్ని విధాలా అభివృద్ధి జరిగిన హైదరాబాద్ నగరం తెలంగాణకే వెళ్లిపోయిందని, ఆ రాష్ట్రానికి జలాల్లో అన్యాయం జరిగిందనడం సరికాదని పేర్కొంది. నీళ్ల వాటాలో అన్యాయం జరిగిందని తెలంగాణ చెప్తుండగా.. అసలు రాష్ట్ర విభజనే సరిగ్గా జరగలేదంటూ కొత్త వాదనలకు దిగింది. హైదరాబాద్‌‌‌‌తో తెలంగాణకు లాభం కలిగిందని పేర్కొంది. ఇరిగేషన్ పరంగా రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరిగిందని తెలిపింది. బుధవారం కృష్ణా(బ్రజేశ్ కుమార్) ట్రిబ్యునల్ ముందు ఏపీ తన చివరి వాదనలను వినిపించింది. కృష్ణా జలాలను పున:పంపిణీ చేయరాదని, ఇప్పటికే ఉన్న కేటాయింపుల(512:299 టీఎంసీలు)కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. బచావత్, బ్రజేశ్​ కుమార్ ట్రిబ్యునళ్లతో పాటు విభజన చట్టంలోని సెక్షన్ 89లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొంది. 

కావేరి ట్రిబ్యునల్ వాదనల్లోనూ అమల్లో ఉన్న కేటాయింపులను మార్చొద్దని చెప్పిందని తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 4 (1) ప్రకారం కూడా పరిష్కారమైన వివాదాలను మళ్లీ ఓపెన్ చేయరాదని, పున:కేటాయింపులు చేయకూడదని వాదించింది. బ్రజేశ్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్ 17 ప్రకారం.. రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ లేనప్పుడు.. పార్లమెంట్ ద్వారానే కేటాయింపులను మార్చేందుకు వీలుంటుందని వాదించింది. క్లాజ్ 14బీ ప్రకారం.. ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను డిస్టర్బ్ చేయరాదని తెలిపింది. కాగా, గురువారం నాటితో ఏపీ వాదనలు ముగియనుండగా.. శుక్రవారం నుంచి తెలంగాణ అభ్యంతరాలు, వివరణలు ఇవ్వనుంది.  

దిగువ రాష్ట్రాలకే క్యారీ ఓవర్​

కృష్ణా జలాలకు సంబంధించిన క్యారీ ఓవర్‌‌‌‌‌‌‌‌ జలాలను దిగువ రాష్ట్రమైన తమకే ఇవ్వాలని ఏపీ వాదించింది. ఔట్​సైడ్​ బేసిన్‌‌‌‌కూ నీటి తరలింపులు చేసుకోవచ్చని తెలిపింది. ‘‘కృష్ణా జలాల విషయంలో ఔట్​సైడ్​ బేసిన్‌‌‌‌కూ వాడుకోవచ్చని ట్రిబ్యునల్ చెప్పింది. అది లీగల్ అని పేర్కొంది. కాబట్టి ఔట్​సైడ్ బేసిన్ తరలింపులకూ రక్షణ కల్పించాలి. ప్రాజెక్టుల్లో సేవింగ్స్ అనేవి లేవు. సీడబ్ల్యూసీ వంటి ఎక్స్​పర్ట్ బాడీస్​ కూడా చెప్పలేదు. సేవింగ్స్​ ఉన్నాయని తెలంగాణ అనుకుంటే.. సీడబ్ల్యూసీ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలి. ప్రాజెక్టుల మోడర్నైజేషన్​వల్లే సేవింగ్స్ ఉంటాయి. 

కేడీఎస్ అందులో భాగమే. ఎన్​బ్లాక్ కింద నీళ్లు ఇచ్చారు. కృష్ణా కాకుండా వేరే నదుల నుంచి తీసుకున్న నీళ్లను సేవింగ్స్‌‌‌‌లో చూపెట్టడానికి లేదు. సేవింగ్స్ అనేవి ఏ స్టేట్‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులకు ఆ స్టేట్‌‌‌‌లోనే ఇవ్వాలి. క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్‌‌‌‌నూ మార్చడానికి లేదు. బేసిన్ పరంగా కేటాయింపులు చేయరు. తలసరి నీటి వినియోగం ఆధారంగానూ చేయడానికి లేదు. తెలంగాణ చేసిన లెక్కలు తప్పు. బచావత్ ట్రిబ్యునల్ ఓ పద్ధతి ప్రకారమే లెక్కించి కేటాయింపులు చేసింది’’ అని ఏపీ తన వాదనలలో పేర్కొంది.