హెచ్‌‌సీఏలో ఇకపై పూర్తి పారదర్శకత

హెచ్‌‌సీఏలో ఇకపై పూర్తి పారదర్శకత

 

  • అపెక్స్ కౌన్సిల్ సభ్యుల నిర్ణయం
  • తాత్కాలిక ప్రెసిడెంట్‌‌గా దల్జీత్‌‌ సింగ్‌‌కు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు, క్రికెట్ కార్యకలాపాలను సాఫీగా నడిపేందుకు అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం కేసులో ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు జ్యుడిషియల్ అరెస్ట్ అవడం, సెక్రటరీ దేవరాజ్‌‌ పరారీలో ఉండటంతో మిగిలిన సభ్యులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. 

హెచ్‌‌సీఏ నిబంధనల మేరకు అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే అధికారంతో వైస్ ప్రెసిడెంట్ సర్దార్ దల్జీత్ సింగ్‌‌ను తాత్కాలిక ప్రెసిడెంట్‌‌గా  జాయింట్ సెక్రటరీ టి. బసవ రాజు, కౌన్సిలర్ సునీల్ కుమార్ అగర్వాల్, కాగ్ నామినీ  రాజశేఖర్ -తో కూడిన అపెక్స్ కౌన్సిల్ నియమించింది. ఈ నిర్ణయం వల్ల అసోసియేషన్‌‌ కార్యకలాపాలు నిలిచిపోకుండా, ఆటంకాలు లేకుండా ఆట ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. అలాగే సోసియేషన్, ప్లేయర్ల కోసం కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్ల సమస్యలను  పరిష్కరించడానికి మూడంచెల ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

 హెచ్‌‌సీఏ అకాడమీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఫుల్‌‌ టైమ్ డైరెక్టర్‌‌, కోచింగ్ స్టాఫ్ ను నియమించే ప్రక్రియ మొదలు పెట్టనుంది. తాత్కాలిక నాయకత్వం గురించి, ఇకపై అధికారిక నిర్ణయాల గురించి బీసీసీఐకి తెలియజేయాలని, హెచ్‌‌సీఏ పరిధిలోని అన్ని క్రికెట్ గ్రౌండ్స్‌‌లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని కౌన్సిల్ సభ్యులు నిర్ణయించారు.  హెచ్‌‌సీఏ సీఈవో పోస్టుకు అప్లికేషన్ డెడ్‌‌లైన్‌‌ను ఈ నెల 25 వరకు పొడిగించారు.  ఫిర్యాదుల పరిష్కారం నుంచి ఆడిట్ వరకు అన్ని విషయాల్లో పారదర్శకత పాటించాలని అపెక్స్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. తమకు ఆటగాళ్ల సంక్షేమం, వారి అభివృద్ధే ముఖ్యమని, టీమ్ సెలక్షన్స్‌‌ను  నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా లీగ్ మ్యాచ్‌‌లు, అకాడమీలను కొనసాగిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది.