టెల్ అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై మిస్సైల్ దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే.. ఇరాన్ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రధాని బెంజమన్ నెతన్యాహు ఆఫీస్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయోల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై మిస్సైల్ దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4లో భాగంగా ఈ అటాక్ చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నెతన్యాహు ఏమయ్యారో తెల్వదని తెలిపింది.
►ALSO READ | ముందు వెనక చూస్కోవాలి కదా: పొరపాటున 3 అమెరికన్ ఫైటర్ జెట్లను కూల్చేసిన కువైట్
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడులను తీవ్రం చేసింది. ఇరాన్ గల్ఫ్ ప్రాంతమంతా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో బహ్రెయిన్లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఇరాక్, కువైట్లలోనూ ఇరాన్ వైపు నుంచి దాడులు జరిగినట్లు ఆయా దేశాలు వెల్లడించాయి.
అమెరికాతో అణు చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వచ్చిన కథనాలను ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఖండించారు. ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ టెహ్రాన్ గుండెభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ప్రకటించింది. తెహ్రాన్‌లోని నిలోఫర్ స్క్వేర్ ప్రాంతంలో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఇరవై మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
