టెక్నాలజీ వల్ల ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయనేందుకు ఉదాహరణ ఈ ఘటన. యాపిల్ స్మార్ట్‌వాచ్ 4 ఓ వృద్ధుడికి అత్యవసర స్థితిలోసాయం అందేలా చేసి అతడి ప్రాణాలు కాపాడింది. నార్వేకు చెందిన మీడియా కథనం ప్రకారం.. ఆ దేశానికి చెందిన అరవై ఏడేళ్ల టోరల్వ్ అనే ఓ వృద్ధుడు రాత్రి పూట బాత్ రూమ్ కు వెళ్లి స్పృహతప్పి పడిపోయాడు. బలంగా కింద పడటంతో అతడి మునికి గాయాలయ్యాయి. ఇంట్లో ఒంటరిగానే ఉండటంతో తక్షణ వైద్యసాయం అవసరమైనా, సాయంచేసే వాళ్లెవరూ పక్కన లేరు. కానీ, అతడు చేతికి పెట్టుకున్న యాపిల్ స్మార్ట్‌వాచ్ 4 ఉపయోగపడింది. టోరల్వ్ కిందపడగానే స్మార్ట్‌వాచ్‌లోని ‘ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ’ అలర్టై, ఎమర్జెన్సీ సర్వీసుకు మెసేజ్ పంపింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి చూడగా అతడు బాత్ రూమ్ లో పడి ఉన్నాడు. వెంటనే వాళ్లు అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎలా పని చేస్తుంది?
కొన్ని స్మార్ట్‌వాచుల్లో ‘ఫాల్ డిటెక్షన్ ఫీచర్’ ఉంది. అంటే వాచ్ ధరించిన ఎవరైనా బలంగా కిందపడిపోతే వెంటనే గుర్తిస్తుంది. ‘యాక్సెలోమీటర్ ’, ‘గైరోస్కోప్’లు ఇందుకు ఉపయోగపడతాయి. ఇవి కస్టమ్ అల్గారిథమ్‌లను వినియోగించుకుని 32 రకాల జీ ఫోర్స్‌లను లెక్కిస్తాయి. యాపిల్ వాచ్ 4లో ఈ ఫీచర్ ఉంది. కింద పడ్డప్పుడు వేగం, మోచేతి కదలికలు వంటి ఆధారంగా దాని తీవ్రతను గుర్తించి వెంటనే ఒక అలర్ట్ వస్తుంది. ఒకవేళ యూజర్లు పెద్దగా గాయపడకుండా ఉంటే అలర్ట్‌ను డిస్మిస్ చేయొచ్చు. 60 సెకండ్లపాటు అలా చేయకపోతే యూజర్లు గాయపడ్డారని, ప్రమాదంలో ఉన్నారని గుర్తించి ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో చేస్తుంది. లొకేషన్ కూడా చేరవేస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై సాయం అందిస్తే బాధితులు ప్రమాదం నుంచి టెక్నాలజీ నుంచి గాయపడొచ్చు.
