ఎల్​బీనగర్​ సర్కిల్​కు శ్రీకాంతాచారి పేరు.. బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం

ఎల్​బీనగర్​ సర్కిల్​కు శ్రీకాంతాచారి పేరు.. బల్దియా స్టాండింగ్ కమిటీ  ఆమోదం
  • ఎల్​బీనగర్​ సర్కిల్​కు శ్రీకాంతాచారి పేరు
  • బల్దియా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలను సభ్యులు ఆమోదించారు. ఎల్​బీనగర్ జంక్షన్​కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరు పెట్టేందుకు సిఫార్సు చేయగా, ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో 54 జారీ చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఐటీ సెక్షన్ ద్వారా కాల్ సెంటర్ 040–-2111 1111 నిర్వహణను రూ.2కోట్ల27లక్షల2వేల61తో జీవీకే- ఈఎంఆర్ఐ గ్రీన్​హెల్త్​సర్వీసెస్​కు 2026, మే 31వరకు అప్పగించారు. ఎస్ఆర్​డీపీలో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్ ఆర్​హెచ్ఎస్ ఫ్లైఓవర్​కు మాల్​మైసమ్మ ఫ్లైఓవర్​గా నామకరణం చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్​రోడ్ నం.92 నుంచి బంజారాహిల్స్​రోడ్ నం.12 వరకు18 మీటర్ల లింక్ రోడ్డు నిర్మించాలని మాస్టర్​ప్లాన్​లో చేర్చారు. ఇందుకోసం 15 ఆస్తులు సేకరించాలని నిర్ణయించారు. కొండాపూర్ జంక్షన్ నుంచి పోలీస్ కాలనీ వరకు 18 మీటర్ల రోడ్డును వెడల్పు చేయాలని, సఫారీనగర్​నుంచి కొండాపూర్​జానీ మజీద్​మీదుగా హెచ్​టీలైన్​పోలీస్​గ్రౌండ్​వరకు 30 మీటర్ల రోడ్డును వెడల్పు చేయాలని, ఇందుకోసం 43 ఆస్తులు సేకరించాలని ఆమోదించారు. అలాగే టీకేఆర్ కమాన్ నుంచి సాగర్ రోడ్ వయా జడ్పీ రోడ్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు చేయాలని, 282 ఆస్తులు సేకరించాలని నిర్ణయించారు. మూసారాంబాగ్​టీవీ టవర్ జంక్షన్ నుంచి అలీ కేఫ్ జంక్షన్(1.4 కిలోమీటర్లు), అంబర్​పేట మూసీ రివర్ కాజ్​వే(0.6 కిలోమీటర్ల) 48 మీటర్ల వెడల్పునకు మొత్తం109 ఆస్తులు సేకరించాలని ఆమోదించారు. రూ.3కోట్లతో గాజులరామారం పెరికి చెరువు వద్ద డ్రైనేజీ డైవర్షన్ నిర్మించాలని, టెండర్ అనుమతికి ఆమోదం తెలిపారు. బేగంపేట సర్కిల్ దనియాలగుట్టలో మహాపరినిర్వాణ(గ్రేవ్ యార్డ్)ను నిర్వహణను మహాప్రస్థానం ట్రస్ట్​కు ఐదు సంవత్సరాల పాటు సీఎస్ఆర్ కింద అప్పగిస్తూ ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, ఇఎన్ సీ జియాఉద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, సీఈ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. 
కార్మికురాలి కుటుంబానికి రూ.2లక్షల అందజేత
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పారిశుద్ధ్య కార్మికురాలు దుర్గమ్మ కుటుంబానికి మేయర్ విజయలక్ష్మి రూ.2 లక్షలు అందజేశారు. ఈ ఏడాది జనవరి 4న హయత్ నగర్ సర్కిల్ ఆటో నగర్ హైవేపై స్వీపింగ్ పనులు చేస్తుండగా దుర్గమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలను ఓ వెహికల్​ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ జనవరి 14న చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులకు శుక్రవారం పరిహారం 
అందజేశారు.
56 మంది ఏఎంసీలు బదిలీ
జీహెచ్ఎంసీలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీ), సూపరింటెండెంట్లు బదిలీ అయ్యారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న సూపరింటెండెంట్లతోపాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కల్పించారు. 56 మంది ఏఎంసీలతోపాటు 58 మంది సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ కమిషనర్ లోకేశ్ కుమార్​ఆదేశాలు జారీ చేశారు. 83 మంది సూపరింటెండెంట్లలో 25 మందిని యాధావిధి కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.