షాంఘై: ఇండియా యంగ్ ఆర్చర్ సాహిల్ జాదవ్.. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–2లో బ్రాంజ్ మెడల్‌తో మెరిశాడు. శనివారం జరిగిన బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్‌లో సాహిల్ 147–144తో మార్టిన్ డామ్స్‌బో (డెన్మార్క్)పై నెగ్గాడు. దాంతో తన రెండో వరల్డ్ కప్‌లోనే మెడల్ నెగ్గడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియాకు ఇది తొలి పతకం కావడం గమనార్హం. హోరాహోరీగా సాగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సాహిల్ ఆరంభంలో స్వల్పంగా వెనకబడ్డాడు. తొలి రౌండ్‌లో డామ్స్‌బో వరుసగా మూడు పర్ఫెక్ట్ 10లతో ఆధిక్యం సాధించాడు. కానీ ఒత్తిడికి లోనుకాకుండా రెండో రౌండ్‌లో సాహిల్ 30 పాయింట్లు నెగ్గాడు. డామ్స్‌బో 27 పాయింట్లకే పరిమితమయ్యాడు. దాంతో 59–57తో ఆధిక్యంలో నిలిచిన సాహిల్ చివరివరకు అదే జోరును కొనసాగించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సాహిల్ ఒక్క పాయింట్ తేడాతో వరల్డ్ మూడో ర్యాంకర్ నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
