మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి ఇలాకాల్లో ఇస్తున్నరా?: రేవంత్

మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి ఇలాకాల్లో ఇస్తున్నరా?: రేవంత్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం 2003 నాటి పరిస్థితులే దాపురించాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు చంద్రబాబు హయాంలో వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలుండేవని గుర్తుచేశారు. శనివా రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, పార్టీ నేతలతో కలిసి గాంధీ భవన్​లో మీడియాతో రేవంత్ మాట్లాడారు. అంతకుముందు పార్టీ నేతలతో హాత్ సే హాత్ జోడో యాత్రపై మాణిక్ రావు ఠాక్రే చర్చించారు. ‘‘రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలు మళ్లీ వచ్చాయి. కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 2014 నుంచి 2017 వరకు రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉంది.’’ అని విమర్శించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చామని కేసీఆర్ చెప్తున్నారని, అక్కడకు వెళ్లి చూస్తే 119 నియోజకవర్గాల్లో ఎన్ని ఊర్లకు నీళ్లిచ్చారో తెలుస్తుందని అన్నారు. ‘‘కేసీఆర్ సొంతూరు చింతమడకలో నీళ్లు వస్తున్నయా? మంత్రులు హరీశ్​, దయాకర్​రావు సొంతూర్లలో నీళ్లిస్తున్నరా?’’ అని నిలదీశారు. 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒకతాను ముక్కలే

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక తాను ముక్కలేనని రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఉద్దేశంతోనే రెండు పార్టీలు తిట్టుకుంటున్నట్టు నాటకమాడుతున్నాయని ఆరోపించారు. రాజ్​భవన్​, ప్రగతిభవన్ మధ్య నిన్న మొన్నటి దాకా వివాదాలున్నాయని, కానీ ఇప్పుడు అలయ్ బలయ్ అయ్యాయని గవర్నర్ స్పీచ్‌‌‌‌‌‌‌‌తో తేలిపోయిందని అన్నారు. కేసీఆర్​ అబద్ధాలను కప్పిపుచ్చేందుకు గవర్నర్ బ్రాండ్ అంబాసిడర్​గా మారారని ఆరోపించారు. కేటీఆర్​కు రాజకీయ పరిజ్ఞానం తక్కువని, విదేశాల్లో చదువుకుని వచ్చిన ఆయన అవే విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ క్యాట్​వాక్​లు, డిస్కో డ్యాన్సుల గురించి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

మేడారం నుంచి యాత్ర

మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను సోమవారం ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు. మహబూబాబాద్ లోక్​సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్ర చేస్తానన్నారు. ‘‘కరోనా సమ యంలో సీతక్క ఎన్ని సేవలు చేశారో అందరికీ తెలుసు. గిరిజనుల హక్కుల కోసం రాజులు, రాచ రికం మీద పోరాడిన సమ్మక్క సారలమ్మలు రక్తం చిందించారు. అందుకే ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి యాత్రను మొదలుపెడుతున్నా’’ అని తెలిపారు. తొలి విడతలో 22వ తేదీ వరకే యాత్ర ఉంటుందని, 24, 25, 26వ తేదీల్లో చత్తీస్​గఢ్ రాజధాని రాయ్​పూర్​లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఉండటంతో మూడు రోజులు యాత్ర ఉండదని చెప్పారు.

2 నెలలు.. 2 విడతల్లో యాత్ర: మాణిక్ రావు ఠాక్రే

హాత్ సే హాత్ జోడో యాత్రను రెండు నెలలపాటు రెండు విడతల్లో చేపడతామని మాణిక్ రావు ఠాక్రే చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు వేర్వేరు ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభిస్తారని వెల్లడించారు. అన్ని ఊర్లూ తిరుగుతామని, రాహుల్​ సందేశాన్ని గడపగడపకూ చేరవేస్తామని తెలిపారు.