
- చేతి గాయం నుంచి కోలుకున్న పేసర్
- బుమ్రాపై మ్యాచ్ రోజే నిర్ణయం
లండన్: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు టీమిండియా తుది జట్టుపై కసరత్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే చాన్స్ ఉంది. ఈ మేరకు మంగళవారం జరిగిన అప్షనల్ నెట్ సెషన్‌లో అర్ష్‌దీప్ ఫుల్ ప్రాక్టీస్ చేశాడు. వాస్తవానికి చివరి రెండు టెస్ట్‌ల్లోనే అతన్ని బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ భావించినా.. చేతి గాయం కారణంగా నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించడంతో ఐదో టెస్ట్‌లో ఆడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక మాంచెస్టర్ మ్యాచ్‌లో బౌలర్లు ఫెయిలైన నేపథ్యంలో అర్ష్‌దీప్‌ను తీసుకురావడంతో కొత్త కాంబినేషన్స్‌ను ట్రై చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌తో కలిసి అర్ష్‌దీప్ బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఒకవేళ చివరి నిమిషంలో ఊహించని మార్పులు చేయాల్సి వస్తే బుమ్రాను ఆడించొచ్చు. ‘దేశం తరఫున రెడ్‌బాల్ క్రికెట్ ఆడటం ఏ క్రికెటర్‌కైనా కల. అర్ష్‌దీప్‌ను తీసుకోవడం వల్ల టీమ్‌లో బ్యాలెన్స్ వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంగ్లండ్ పిచ్‌లపై అర్ష్‌దీప్ బౌలింగ్ బాగుంటుంది. టెస్ట్‌లకు అతను సరిగ్గా సరిపోతాడు. ఒకవేళ ఇంగ్లండ్‌లో ఇప్పుడు ఆడించకపోతే ఇంకెక్కడ ఆడిస్తారు’ అని అర్ష్‌దీప్ చిన్ననాటి కోచ్ జస్వంత్ రాయ్ వ్యాఖ్యానించాడు.
జహీర్ తరహాలో..
మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాదిరిగా బంతిని రెండువైపుల స్వింగ్ చేయడంలో అర్ష్‌దీప్ సిద్ధహస్తుడు. నిలకడగా ఆరు మీటర్ల లెంగ్త్‌తో బాల్స్ వేస్తాడు. అదే టైమ్‌లో మంచి స్వింగ్ రాబడతాడు. లెఫ్టార్మ్ సీమర్ కావడం కూడా ప్లస్ పాయింట్. ఓవల్‌లో అతన్ని ఆడిస్తే కాలమే సమాధానం చెబుతుంది. తాను ఈ ఫార్మాట్‌లోనే ఆడాలనే భయం కూడా లేదు. చాన్స్ ఇస్తే ఏ ఫార్మాట్‌లోనైనా రాణించే సత్తా అతనికి ఉంది. ఇప్పటికే 63 టీ20, 9 వన్డేలు ఆడాడు. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ మెంబర్ కూడా. ఈ టోర్నీలో 17 వికెట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్లో 19వ ఓవర్ వేసి కేవలం నాలుగు రన్సే ఇచ్చి సౌతాఫ్రికాను కట్టడి చేశాడు. అయితే టీ20ల కంటే టెస్ట్‌ల్లో ఉండే ఒత్తిడిని అధిగమిస్తేనే మజా ఉంటుందని గతంలోనే అర్ష్‌దీప్ అన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు సెలెక్షన్ కంటే ముందే టెస్ట్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అర్ష్‌దీప్ అందుకు అనుగుణంగా తన ప్రాక్టీస్‌ను కూడా పెంచుకున్నాడు. గత నెల రోజులుగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో చాలా కఠినంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ప్రతి నెట్ సెషన్‌లోనూ అర్ష్‌దీప్ ఆకట్టుకున్నాడు. కాబట్టి గురువారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్ట్‌లో అతను ఆడతాడని అందరూ ఊహిస్తున్నారు.
గంభీర్ X ఫోర్టిస్
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ గ్రౌండ్ చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండున్నర మీటర్ల దూరం నుంచి పిచ్‌ను చూడాలని క్యూరేటర్ చెప్పడం ఈ వాగ్వాదానికి కారణమైంది. ‘నువ్వు ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ మెంబర్‌వి మాత్రమే. మేం ఏం చేయాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే వెళ్లి మీ అధికారులకు ఫిర్యాదు చేస్కో’ అని గౌతీ ఫోర్టిస్ వైపు వేలు చూపిస్తూ గట్టిగా హెచ్చరించాడు. వెంటనే జోక్యం చేసుకున్న బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఇద్దరి మధ్య చేరి వాగ్వాదం పెద్దది కాకుండా చూశాడు. ఫోర్టిస్‌ను పక్కకు తీసుకెళ్లి సర్ది చెప్పాడు. వాస్తవానికి తాడు లోపలికి వెళ్లి సెంటర్ పిచ్‌ను చూడాలని భావించినా అది సాధ్యపడలేదని కోటక్ వెల్లడించాడు.
‘ఇలాంటి సంఘటనను నేనెప్పుడూ చూడలేదు. ప్లేయర్లు స్పైక్‌లు ధరించరు కాబట్టి పిచ్ ఉపరితలానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ క్యూరేటర్‌తో పని చేయడం అనుకూలం కాదని ఇంతకుముందే మాకు తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేం ఉన్నాం. ఈ సంఘటనలపై ఎలాంటి ఫిర్యాదు చేయం’ అని కోటక్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ పిచ్‌ల విషయంలోనూ గౌతీ, ఫోర్టిస్ మధ్య వాదన జరిగినట్లు సమాచారం. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్‌తో పాటు ఇతర సిబ్బంది అలా చూస్తూ ఉండిపోయారు. గొడవ తర్వాత ఫోర్టిస్ అక్కడి నుంచి వెళ్లిపోగా, గౌతీ నెట్ సెషన్‌ను పర్యవేక్షించాడు. మొదట సాయి సుదర్శన్ ప్రాక్టీస్ చేయగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు.