కేటీపీఎస్ లో ఆర్టిజన్ కార్మికుల మెరుపు సమ్మె

 కేటీపీఎస్ లో ఆర్టిజన్ కార్మికుల మెరుపు సమ్మె

పాల్వంచ, వెలుగు: ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని, 2016 లో అర్హత ఉండి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కాంప్లెక్స్ (కేటీపీఎస్) కార్మికులు బుధవారం మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం మూకుమ్మడిగా వరంగల్ ఎన్పీ డీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు వెళ్లిన కార్మికులు యాజమాన్యం చర్చలకు రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్లో సుమారు 1800 మంది కార్మికులకు బుధవారం కేవలం 531 మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో కేటీపీఎస్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా యాజమాన్యం నిషేధాజ్ఞలు విధించడంతో కేటీపీఎస్ హాస్పి టల్ ఎదురుగా గల హెచ్ 84 కార్యాలయ ప్రాంగణంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. వారికి సీఐటీయూ జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, కేటీపీఎస్ లోని పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.