రాజస్థాన్లో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తా

 రాజస్థాన్లో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తా

సచిన్ పైలట్ టార్గెట్ గా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి పేరు తెరపైకి రావడంతో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ముఖ్యమంత్రిని నియమించబోతున్నప్పుడు 80 నుంచి 90 శాతం మంది ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థి వైపు మొగ్గుచూపుతారు. అయితే రాజస్థాన్ లో అలా జరగలేదన్నారు. గెహ్లాట్‌కు విధేయులైన పలువురు ఎమ్మెల్యేలు, సచిన్ పైలట్‌ను  ముఖ్యమంత్రిగా నియమించకుండా  రాజీనామా లేఖలు సమర్పించారు. ప్రజా ప్రతినిధులు ఎందుకు అలా తిరుగుబాటుకు ప్రయత్నించారో తెలుసుకుంటానని చెప్పారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో రాజస్థాన్ లో సీఎం అభ్యర్థి మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గెహ్లాట్ తెలిపారు. తన చివరి శ్వాస వరకు రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండోసారి రాజస్థాన్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అంటే తాను సీఎంగా కొనసాగుతాననే విషయాన్ని గెహ్లాట్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.