కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేర్లం కాదు : అశ్వత్థామ రెడ్డి

కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేర్లం కాదు : అశ్వత్థామ రెడ్డి

కార్మికులను తొలగిస్తారా..కోర్టులోనే తేల్చుకుంటాం
కేసీఆర్ పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఫైర్
బంగారు తెలంగాణ కాదు..

హైదరాబాద్‌, వెలుగు:‘‘ఆర్టీసీలో 48 వేల మంది కార్మికులకు షోకాజ్ పంపుతారో.. తొలగిస్తారో చేసుకోండి చూద్దాం.. బెదిరిస్తే వెనక్కి తగ్గేదిలేదు. దీనిపై కోర్టులకైనా వెళ్తాం. న్యాయ పోరాటం చేస్తాం” అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. తాము కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పాలేరులం కాదని, రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం సంపాదించుకున్నామని చెప్పారు. సోమవారం గన్‌పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి అటు తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యమ ఫోబియా సోకిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు బతుకమ్మ ఆడితే వారిపై లాఠీఛార్జ్ చేశారని తెలిపారు. ఆర్టీసీలో 50 శాతం అద్దె బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్ చేయడమే దేశానికే ఆదర్శమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు వెళ్తే అరెస్ట్ చేయడం ఏమిటన్నారు.

సీఎం పిచ్చితుగ్లక్​: రాజిరెడ్డి

ముఖ్యమంత్రి పిచ్చి తుగ్లక్ అని, డెలివరీ సమయంలో కూడా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారా లేదా అని అడిగే రకమని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి మండిపడ్డారు. బంగారు తెలంగాణ అవసరం లేదని, బతుకు తెలంగాణ కావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కార్మికుల కంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా జీతాలు ఎక్కువగా లేవని తెలిపారు. శ్రామిక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు ఎవరికీ రూ. 50 వేలకు మించి లేదని, సీఎం మాత్రం రూ. 50 వేలు ఉన్నాయని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జీతాలు తక్కువుంటే సీఎం చెప్తున్నంత జీతం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా మంగళవారం అన్ని డిపోల ఎదుట జమ్మి పూజ చేసి, నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు.