V6 News

పోలీస్ వెహికల్ ఢీకొని ఏఎస్సై మృతి

పోలీస్  వెహికల్  ఢీకొని ఏఎస్సై మృతి
  •     పరారీలో వెహికల్​ డ్రైవర్
  •     సంగారెడ్డి జిల్లా మనూర్ లో ఘటన

నారాయణ్ ఖేడ్ వెలుగు: పోలీస్​ వెహికల్​ ఢీకొని డ్యూటీలో ఉన్న ఏఎస్సై చనిపోయాడు. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గం పరిధిలోని మనూర్  పోలీస్​స్టేషన్​లో  ఏఎస్సైగా గోవింద్  నాయక్(58) పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి కానిస్టేబుల్ వెంకట్, హోంగార్డ్(డ్రైవర్)  రామారావుతో కలిసి పెట్రోలింగ్  నిర్వహిస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో స్టేషన్ కు చేరుకొని పక్కనే ఉన్న తహసీల్దార్  ఆఫీస్​ సమీపంలో ఏఎస్సై నిల్చున్నాడు. అదే సమయంలో డ్రైవర్  రామారావు వెహికల్​ను అజాగ్రత్తగా నడపడంతో ఏఎస్సైపై నుంచి వెహికల్​ వెళ్లింది. తీవ్రగాయాలపాలైన అతడిని చికిత్స కోసం నారాయణఖేడ్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు హాస్పిటల్  సిబ్బంది తెలిపారు. 

హోంగార్డు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇదిలా ఉంటే ఏఎస్సై మృతిపై కుటుంబ సభ్యులు, పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని అతని కొడుకు సుప్రీత్  ఫిర్యాదు చేశాడు. గోవింద్​నాయక్ అంత్యక్రియలు డీఎన్టీ తండాలో నిర్వహించగా, ఎస్పీ పారితోష్  పంకజ్, నారాయణఖేడ్  డీఎస్పీ వెంకట్​రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. గోవింద్  నాయక్  1990లో హోంగార్డుగా చేరి 1993లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.