
- నేడు తొలి పోరులో అఫ్గాన్ తో హాంకాంగ్ ఢీ
- రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ లో లైవ్
దుబాయ్: యావత్ ఆసియా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ యూఏఈ వేదికగా మంగళవారం ప్రారంభం కానుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు కీలక సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇండియా, పాక్‌తో పాటు పలు జట్లు లెజెండరీ ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగుతుండటం ఈ ఎడిషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. మెగా టోర్నీలో గ్రూప్-ఎలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్‌తో పాటు యూఏఈ, ఒమన్ బరిలో ఉండగా.. గ్రూప్–- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ పోటీ పడుతున్నాయి.
తొలి రోజు అఫ్గానిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నీకి తెరలేవనుంది. బుధవారం ఇండియా తన మొదటి మ్యాచ్ లో యూఏఈతో పోటీ పడనుంది. అయితే, ఈనెల 14న జరిగే ఇండో–-పాక్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి అసలు ఊపు రానుంది. గ్రూప్ దశలో ప్రతీ జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతీ గ్రూప్ లో టాప్-2లో నిలిచిన జట్టు సూపర్ 4 రౌండ్ కు క్వాలిఫై అవుతాయి. అక్కడ ఒక్కో టీమ్ మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-2 టీమ్స్ ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
ఇండియాను ఆపేదెవరు ?
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మిగిలిన ఏడు జట్లకు, ఇండియాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే 'ఫేవరెట్' అనే పదం కూడా చిన్నదే అవుతుంది. అయితే, ఈ ఆధిపత్యమే కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన ఇండియా తొమ్మిదో టైటిల్ గెలిస్తే అది పెద్ద ఘనత కాబోదు. కానీ పొరపాటున ఓడితే మాత్రం విమర్శల జడివాన కురవడం ఖాయం. మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ ఫలితం జట్టు ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అయినా ఇండియా స్థాయికి మిగతా జట్లు చాలా దూరంలో ఉన్నాయి. సల్మాన్ అలీ అఘా నేతృత్వంలోని పాక్ జట్టు బాబర్ ఆజమ్, రిజ్వాన్‌ను పక్కబెట్టి బరిలోకి దిగుతోంది. షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి బౌలర్లు ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను ఎలా కట్టడి చేస్తారనే దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. చరిత్ అసలంక సారథ్యంలోని శ్రీలంక జట్టు సమతూకంలో ఉన్నా.. టోర్నీ మొత్తం నిలకడగా రాణించడంపై సందేహాలున్నాయి.
లిటన్ దాస్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నందున ఆ టీమ్‌లో టైటిల్ గెలిచే సత్తా కనిపించడం లేదు. ఈ టోర్నీలో ఇండియాకు అఫ్గానిస్తాన్ సవాల్ విసరగలదు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కొత్త ప్లేయర్ ఘజాన్‌ఫర్‌లతో కూడిన ఆ టీమ్ స్పిన్ విభాగంతో ఏ జట్టుకైనా ప్రమాదకరమే. ఇటీవలే యూఏఈలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది.
యూఏఈ, ఒమన్, హాంకాంగ్ వంటి అసోసియేట్ దేశాలకు ఇది తమ సత్తా చాటేందుకు దొరికిన సువర్ణావకాశం. సూర్యకుమార్, బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో తలపడటం వారికి అమూల్యమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ జట్లలో పలువురు ఇండియా, పాక్ సంతతి ఆటగాళ్లు ఉన్నారు. మొత్తంగా ఈ టోర్నీలో ఇతర జట్లు ఎలా ఆడతాయనే దానిపై కాకుండా, ఇండియా ట్రోఫీ గెలుస్తుందా? లేదా? అనేదే ప్రధానం కానుంది.