
- పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు నో
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడేందుకు టీమిండియాకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త పాలసీ ప్రకారం బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో పాక్‌తో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అయితే తటస్థ వేదికల్లో కూడా పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని స్పష్టం చేసింది. కొత్త పాలసీ ప్రకారం పాక్ తమ గడ్డపై అడుగు పెట్టడానికిగానీ, ఇండియా అక్కడికి వెళ్లడానికిగానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
‘బహుళ టోర్నీల కోసం పాక్ వెళ్లాల్సిన అవసరం వస్తే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుంది. ఎక్కువ దేశాలు పాల్గొనే టోర్నీలో ఆడకుండా ప్లేయర్లను నిరుత్సాహపర్చలేం. అన్నింటికంటే పాకిస్తాన్ ఓ చెత్త బుట్ట అని ప్రకటించడానికి ఎటువంటి సంకోచం లేదు’ అని మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. కొత్త పాలసీకి సంబంధించిన వివరణాత్మక విధివిధానాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చిన మినిస్ట్రీ.. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ పేరును స్పష్టంగా పేర్కొంది. ‘పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న క్రీడా ఈవెంట్ల పట్ల ఇండియా విధానం.. ఆ దేశంతో వ్యవహరించే అన్ని అంశాల్లో ఇది ప్రతిబింబిస్తుంది. ఆ క్రమంలో పరస్పర దేశాల్లో జరిగే ద్వైపాక్షిక ఈవెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. పాక్ జట్టు ఇండియాలో పర్యటించేందుకుగానీ, మనం అక్కడికి వెళ్లేందుకు గానీ ఎలాంటి అవకాశాల్లేవు. ఒకవేళ అమెరికాలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఏర్పాటు చేసినా ఇండియా జట్లు పాల్గొనవు’ అని మినిస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి.
యూఏఈకి వెళ్తున్నాం..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్‌లో ఇండియా ఆడకూడదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా స్పోర్ట్స్ మినిస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మల్టీ నేషనల్ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఆసియా కప్‌లో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. కాబట్టి టీమిండియాను ఆపలేం. ఒకవేళ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతానికి మనం ఆసియా కప్ మ్యాచ్‌ల కోసం యూఏఈకి వెళ్తున్నాం. అక్కడే ఆడతాం’ అని స్పోర్ట్స్ మినిస్ట్రీ తెలిపింది. భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే ఈ విధానంలో మార్పులుంటాయా అన్న ప్రశ్నకు.. ‘ఈ సమయంలో ఇది అసంభవం’ అని కుండబద్దలు కొట్టింది.
2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని కోరుకుంటున్న ఇండియా.. ఒలింపిక్ చార్టర్‌తో పాటు ప్రపంచస్థాయి ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ విధానం ద్వారా స్పష్టం చేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు ఇండియాకు వచ్చేందుకు నిరాకరించినా, వచ్చే నెలలో బిహార్‌లో జరిగే ఆసియా కప్ కోసం వారికి వీసాలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించడం కూడా ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సంస్థలకు చెందిన ఆఫీస్ బేరర్స్‌కు వాళ్ల హోదా, అధికారిక పదవీకాలాన్ని బట్టి మల్టీ ఎంట్రీ వీసాలను అందజేస్తామని తెలిపింది. ‘ఇండియాలో జరిగే బహుళ దేశాల టోర్నీలో ఆడేందుకు పాక్ ప్లేయర్లకు అనుమతి ఇస్తాం. ఇంటర్నేషనల్ ఈవెంట్లను నిర్వహించడానికి ఇండియా గమ్యస్థానం కావాలని మేం కోరుకుంటున్నాం. కాబట్టి ప్లేయర్లు, అధికారులు, సాంకేతిక సిబ్బంది, ఇంటర్నేషనల్ బాడీస్ ఆఫీస్ బేరర్లకు వీసా ప్రక్రియను సులభతరం చేస్తాం. ప్రొటోకాల్ ప్రకారం వీళ్లు స్వేచ్ఛగా ఉండొచ్చు. దేశంలో వాళ్ల కదలికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు తగినట్లుగా మర్యాదలు కూడా అందుతాయి’ అని మినిస్ట్రీ స్పష్టం చేసింది.