సంగారెడ్డి, వెలుగు: రూ.10కి కర్రీ ఇవ్వలేదన్న కోపంతో కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. పటాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో ఈ ఘటన జరిగింది. అమీన్పూర్ బీరంగూడలో తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఓం శ్రీసాయి కర్రీ పాయింట్‌కు శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన జీవరత్నం
వెళ్లాడు.
పది రూపాయల కర్రీ ఇవ్వాలని దుకాణంలో పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్‌ను కోరాడు. అతను రూ.30కు ఇస్తామని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జీవరత్నం కొద్దిసేపటి తర్వాత కత్తి తీసుకుని వచ్చి ఉదయ్ భాస్కర్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో ఉదయ్ తలకు తీవ్ర గాయం కావడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోగా జీవరత్నం పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నిందితుడు జీవరత్నం అంబేద్కర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.

