చెన్నై/కోల్కత్తా: తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ రికార్డ్ స్థాయి దిశగా దూసుకెళుతోంది. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 90 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 82.24 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక.. పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా.. బెంగాల్లోని 294 సీట్లకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా బెంగాల్లో 152 నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది.
బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తర బెంగాల్‌లోని 54 స్థానాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, మాల్దా వంటి సరిహద్దు జిల్లాల్లో పోలింగ్ సాగనుంది. కోటి 75 లక్షల మంది మహిళలతో సహా మొత్తం 3.60 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం 8,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆయా చోట్ల రికార్డు స్థాయిలో 2,450 (2 లక్షల నుంచి 2.45 లక్షల మందికి పైగా జవాన్లు) కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. దీన్నిబట్టి ఇక్కడ పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
►ALSO READ | బెంగాల్ ఎన్నికల్లో వింత: క్యూ లైన్ లోకి వచ్చిన ఏనుగు.. భయంతో పరుగెత్తిన ఓటర్లు!
2021 ఎన్నికల్లో ఈ 152 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 93 సీట్లు గెలవగా, బీజేపీ 59 స్థానాలకే పరిమితమైంది. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ ప్రాంతం బీజేపీకి భారీ ఆధిక్యాన్ని అందించింది. ఇప్పుడు దక్షిణ బెంగాల్‌లో టీఎంసీని ఢీకొట్టాలంటే.. బీజేపీ ఉత్తర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గూర్ఖా సమస్యకు ఆరు నెలల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇక్కడి ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక.. తమిళనాడు విషయానికొస్తే.. తమిళనాడులో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అధికార డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, విజయ్ టీవీకే పార్టీలు ప్రధానంగా పోటీపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల లోపు 82.24 శాతం ఓటింగ్ జరిగిందంటే.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని చెప్పక తప్పదు. అయితే.. ఓటర్లలో కనిపించిన ఈ చైతన్యం ఏ పార్టీకి కలిసొస్తుందో చూడాలి. 2016లో జయలలిత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డీఎంకే కూడా అలాంటి విజయాన్ని సాధించగలదా అనేది ప్రశ్న.

