ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు..మే11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ

ప్రత్యేక అవసరాల  పిల్లలకు ఉపకరణాలు..మే11 నుంచి  రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ
  • సుమారు 5,800 మందికి లబ్ధి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు బడులు, భవిత సెంటర్లలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు (సీడబ్ల్యూఎస్‌‌ఎన్‌‌) సహాయక ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌ నవీన్‌‌ నికోలస్‌‌ ప్రకటించారు. ఉపకరణాల పంపిణీని ఈ నెల 11 నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

గతేడాది ఆగస్ట్‌‌, సెప్టెంబర్ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్క్రీనింగ్‌‌ క్యాంపుల్లో అలింకో సంస్థకు చెందిన వైద్య నిపుణులు సుమారు 5,800 మంది స్టూడెంట్లకు వివిధ రకాల ఉపకరణాలు అవసరమని గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 3 కోట్లు ఖర్చు చేస్తోంది. వేల రూపాయల విలువ చేసే ఈ పరికరాలను విద్యార్థులకు ఉచితంగా అందజేయనున్నారు. 

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో ఈ ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు. 11న పంపిణీ మొదలై 23వ తేదీలోపు పూర్తి కానుంది. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు తగిన ఆధారాలతో క్యాంప్‌‌లకు వచ్చి పరికరాలను తీసుకోవాలని డైరెక్టర్ నవీన్‌‌ నికోలస్‌‌ సూచించారు. 

ఉపకరణాల పంపిణీ జరిగే తేదీలు, జిల్లాలు

11వ తేదీ : ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ 
13వ తేదీ : నిర్మల్, జగిత్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల 
15వ తేదీ : కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, వనపర్తి 
18వ తేదీ : సంగారెడ్డి, మేడ్చల్, పెద్దపల్లి, హనుమకొండ, నాగర్‌‌ కర్నూల్‌‌
20వ తేదీ : వికారాబాద్, నారాయణపేట, సిద్దిపేట, మహబూబాబాద్, యాదాద్రి
22వ తేదీ : జనగాం, కొత్తగూడెం, సూర్యాపేట