- వాహనం, డబ్బులతో పరార్ అయిన డ్రైవర్ అజిత్
- తెల్లాపూర్‌లో వాహనం గుర్తింపు
- ఏటీఎంలలో డబ్బులు నింపే సంగం సెక్యూరిటీ సెల్యూషన్స్ సిబ్బంది
గచ్చిబౌలి, వెలుగు : ఏటీఎం సెంటర్‌లో క్యాష్ నింపేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ వాహనంతో పాటు అందులో ఉన్న సుమారు రూ. 60 లక్షలతో పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
ఇన్స్‌పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం... సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థకు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గురువారం సంస్థకు చెందిన వాహనంలో కస్టోడియన్లు ఎస్.రామకృష్ణ, ఎండి. మాలిక్, సెక్యూరిటీ గార్డు పెరుమాల్, తిరుమలగిరి ప్రాంతానికి చెందిన డ్రైవర్ అజిత్ కుమార్ కలిసి తొమ్మది ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు బయలుదేరారు.
ఎనిమిది ఏటీఎంలలో డబ్బులు నింపిన తర్వాత చివరగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపన్‌పల్లి యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బులు పెట్టేందుకు వెళ్లారు. కస్టోడియన్లు రామకృష్ణ, మాలిక్ ఏటీఎంలోకి వెళ్లగా.. సెక్యూరిటీ గార్డు పెరుమాల్ మంచినీళ్ల కోసమని పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ అజిత్ క్యాష్‌తో ఉన్న వాహనంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన రామకృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు జీపీఎస్ ఆధారంగా వాహనం తెల్లాపూర్‌లోని గద్దర్ జంక్షన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అజిత్ వాహనాన్ని వదిలి అందులో ఉన్న రూ. 60 లక్షలతో పరార్ అయినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
