సెక్రటేరియట్ నిర్మాణ కాంట్రాక్ట్.. సన్నిహితుల కంపెనీకే!

V6 Velugu Posted on Sep 23, 2020

  • టెండర్​ వేయకుండా ఇతర కంపెనీలకు అడ్డుకట్ట
  • ఒకవేళ వేసినా బుజ్జగించి పంపేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను టీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ల కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యే ఆర్ అండ్ బీ శాఖ విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్  ఆ కంపెనీకి అనుకూలంగా ఉన్నట్టు ఆఫీసర్ల మధ్య చర్చ నడుస్తోంది. దీంతో అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ఇతర కంపెనీలకు పనులు దక్కే చాన్స్ తక్కువని వారు అంటున్నారు.

ఉన్న చోటనే కొత్త సెక్రటేరియట్​ను  7 అంతస్తుల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ.  700 కోట్ల అంచనా వ్యయంతో సివిల్, ఇంటీరియర్ పనులు పూర్తి చేయాలని ప్రాథమిక అంచనా వేశారు. ముందుగా సివిల్ వర్క్స్ కోసం రూ.  500 కోట్ల అంచనా కాంట్రాక్టు విలువతో ఈ నెల 14న టెండర్​ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్​ ఒకటో తేదీలోగా టెండర్ దాఖలు చేయాలి. ఈ నెల 26న ప్రీ బిడ్ సమావేశం ఉంటుంది.  అక్టోబర్​ 5న కాంట్రాక్టర్ ను ఎంపిక చేస్తారు.

ఆ కంపెనీకి అనుకూలంగా కండిషన్స్!

సెక్రటేరియట్ నిర్మాణ పనులను టీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితంగా ఉండే కంపెనీకి కట్టబెట్టేందుకు టెండర్​లో కండిషన్స్ పెట్టినట్టు తెలిసింది. ఈ ఐదేండ్లలో 10 అంతస్తుల ఎత్తులో మూడు హైసెక్యూరిటీ బిల్డింగ్స్ ను  నిర్మించిన అనుభవం ఉండాలని కండిషన్​లో ఉంది. ఈ ఒక్క నిబంధనతోనే మిగతా కంపెనీలకు టెండర్ వేయకుండా చెక్ పెట్టే చాన్స్ ఉందని ఆర్ అండ్ బీకి చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు.  ఒకవేళ మిగతా కంపెనీలు టెండర్ వేసినా, వాటిని బుజ్జగించి వెనక్కి పంపొచ్చని అన్నారు. సెక్రటేరియట్ నిర్మాణం ఎలా ఉండాలి? ఏ విధంగా డిజైన్ చేయాలి? ఎప్పటిలోగా పూర్తి చేయాలి?  అనే కీలక విషయాలపై ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సదరు కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆఫీసర్ల మధ్య చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ కంపెనీ టెండర్ వేయగా.. దాన్ని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆఫీసర్లు అనుకుంటున్నారు.

కలెక్టరేట్లూ కట్టే చాన్స్​!

సదరు కంపెనీ ప్రగతిభవన్ నిర్మాణాన్ని 9 నెలల కాలంలో పూర్తి చేసి టీఆర్ఎస్ పెద్దల నుంచి ప్రశంసలు అందుకున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. ప్రగతిభవన్ పూర్తి చేసినప్పట్నించి ప్రభుత్వం చేపట్టే కీలక నిర్మాణాలను ఆ కంపెనీ దక్కించుకుంటోందని వారు అంటున్నారు. అందులో భాగంగానే పోలీస్ టవర్స్ పనులు కూడా సదరు కంపెనీకి దక్కినట్టు చెప్తున్నారు. టెండర్ పిలిచినప్పుడు టవర్స్ అంచనా వ్యయం రూ. 300 కోట్లు ఉండేది. ఇప్పటికే రూ. 900 కోట్ల వరకు అంచనాలు పెంచినట్టు తెలిసింది. నిర్మాణం పూర్తయ్యే నాటికి మరో వంద కోట్లు ఖర్చయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టరేట్ నిర్మాణ పనులు కూడా సదరు కంపెనీనే చేస్తోంది. ఈ మధ్యే ఆ కంపెనీ సూచన మేరకు కలెక్టరేట్ నిర్మాణ అంచనా వ్యయాలను కూడా మళ్లీ పెంచినట్టు తెలిసింది.

Tagged TRS, construction, WORK, COMPANY, New Secretariat, closest, attempts

Latest Videos

Subscribe Now

More News