ఈ వరల్డ్ కప్ లో ఆసీస్‌ సిక్సర్‌‌  కొడుతుందా?

ఈ వరల్డ్ కప్ లో ఆసీస్‌ సిక్సర్‌‌  కొడుతుందా?
  • ఆరో టైటిల్‌‌ వేటలో కంగారూలు
  • స్మిత్‌, వార్నర్‌ రాకతో పెరిగిన జోరు
  •  బలమైన పేస్‌‌ దళంతో హుషారు

ఒకటా, రెండా.. ఏకంగా ఐదుసార్లు టైటిల్‌‌ను గెలిచిన జట్టు .. రికార్డు స్థాయిలో  ఏడు ఫైనల్స్‌ ఆడిన ఘనత.. విశ్వ సమరంలో అత్యంత ఘన చరిత్ర కలిగిన జట్టు ఏదైనా ఉందంటే అది కేవలం ఆస్ట్రేలియా మాత్రమే. ఐదు నెలల కిందట ఫేవరెట్‌ జాబితాలో కంగారూల పేరు చేర్చడానికి కూడా భయపడినా.. ఇప్పుడు వాళ్ల పేరు లేకుండా ఆ జాబితాను పూర్తి చేయడం అసాధ్యంగా మారింది. 20 నెలల కాలంలో ఏ జట్టు ఎదుర్కోని అవమానాలు, పరాజయాలతో ఉక్కిరిబిక్కిరిఅయినా… వరల్డ్‌‌కప్‌ వరకు అంతా సద్దు మణిగి.. పటిష్టమైన జట్టుతో ఆసీస్ ఆరో టైటిల్‌‌ కోసం వేట మొదలుపెడుతున్నది. ఈ నేపధ్యంలో దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్‌ ను ఏలిన ఘనమైన చరిత్రకు మళ్లీ ప్రాణం పోసి.. బాల్‌‌ టాంపరింగ్ మరకను తుడిచేయాలని పట్టుదలగా కనిపిస్తున్నది.

2015లో  సొంతగడ్డపై వరల్డ్‌ కప్‌ ను గెలిచిన తర్వాత ఆసీస్‌ ఆటతీరు క్రమంగా గాడి తప్పింది. స్టార్‌ ఆటగాళ్లు వివాదాలలో కూరుకుపోవడం.. అవకాశం వచ్చిన ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణమైంది. దీంతో జూన్‌ 2017 నుంచి మార్చి 2019మధ్య కాలంలో అంటే 20 నెలల కాలంలో ఆస్ట్రేలియా26 మ్యాచ్‌ లు ఆడితే కేవలం నాలుగింటిలో గెలిచింది. ఆడిన ఆరు సిరీస్‌ లలో ఒకదాంట్లో కూడా గెలువలేదు.ఇందులో  సొంతగడ్డపై ఆడిన సిరీస్‌ లూ ఉన్నాయి. దీనికితోడు 2018లో బాల్‌ టాంపరింగ్‌ వ్యవహారం ఆసీస్‌ క్రికెట్‌ పై పిడుగులా పడింది. ఈ సంఘటనలో అప్పటి కెప్టెన్‌ స్మిత్‌ , వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌ పాత్ర ఉందని తేలడంతో.. క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది.ఈ ఇద్దర్ని ఏడాది పాటు సస్పెం డ్‌ చేయడంతో కంగారూల ఆట పాతాళానికి పడిపోయింది.

సరిగ్గా ఐదు నెలల కిందటి వరకు ఆసీస్‌ అంటే.. అఫ్గా నిస్థాన్‌ చేతుల్లో కూడా ఓడుతుందనే స్థాయికి దిగజారింది. బలహీనమైన జట్టుతో బరిలోకి దిగి.. సొంతగడ్డపై ఇండియా చేతిలో చరిత్రాత్మక టెస్ట్‌ , వన్డే సిరీ స్‌కోల్పోయి తమ ప్రాభవాన్ని మరింతగా కోల్పోయింది. ఇక ఇంగ్లం డ్‌ లో వరల్డ్‌ కప్‌ నిలబెట్టుకోవడం..డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌ కు కష్టమే అనుకుంటున్న తరుణంలో ఫినిక్స్‌‌ పక్షిలా లేచొచ్చింది. వనరులను కూడగట్టుకుంటూ టీమ్‌ ఇండియాతో జరిగిన వన్డేసిరీస్‌ ను 3–2తో గెలిచి ఫామ్‌ ను అందిపుచ్చుకుంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సొంతగడ్డపై పాక్‌ తో జరిగిన సిరీస్‌ ను 5–0తో క్లీన్‌ స్వీప్‌ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు స్మిత్‌ , వార్నర్‌ రావడంతో ఆసీస్‌ కు తిరుగులేదనే స్థాయిలో నిలిచింది. కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ … జట్టును సమిష్టిగా ఉంచడంలో కీలకపాత్ర  పోషించి విశ్వ సమరానికి జట్టును తీర్చి దిద్దాడు.

బలం

ఆసీస్‌ అంటేనే ఓ సమతుల్యమైన జట్టు. బ్యాట్స్‌‌మెన్‌ , బౌలర్‌ కు కచ్చితమైన లెక్కలు ఉంటాయి. నాలుగు నెలల కిందట బ్యాటింగ్‌ లైనప్‌ కాస్త బలహీనంగా కనిపించినా.. అనుభవజ్ఞులు స్మిత్‌ , వార్నర్‌ రాకతో మరింత బలోపేతం అయ్యింది.సన్‌ రైజర్స్‌‌ తరఫున 12 మ్యాచ్‌ ల్లో 692 పరుగులు చేసిన వార్నర్‌ సూపర్‌ ఫామ్‌ లోఉన్నాడు. ఈ వరల్డ్‌ కప్‌ లో అతన్ని అడ్డుకోవడం మిగతా జట్లకు పెను సవాలే.ఐపీఎల్‌ రికార్డు బాగా లేకున్నా.. స్మిత్‌ కూడా గాడిలో పడ్డాడు. కివీస్‌ పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ల్లో అదరగొట్టాడు. పవర్‌ హిట్టర్లు ఫించ్‌ , మ్యాక్స్‌‌వె ల్‌ , స్టోయినిస్‌ , ఖవాజ కూడా ఫామ్‌ లో ఉన్నారు. ఓవరాల్‌ గా కంగారూల టాప్‌ , మిడిలార్డర్‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నది. ప్రపంచ మేటి బ్యాట్స్‌‌మెన్‌ ను వణికించే పేస్‌ దళం ఆసీస్‌ సొంతం.మిచెల్‌ స్టార్క్‌‌, ప్యాట్‌ కమిన్స్‌‌ ఎలాంటి వికెట్‌ పైనా అయినా పేస్‌ , స్వింగ్‌ , రివర్స్‌‌ స్వింగ్‌ తో వణికిస్తారు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు నాథన్‌ కోల్టర్‌ నీల్‌ , కేన్‌ రిచర్డ్‌ సన్‌ , జాసన్‌ బెరెన్‌ డార్ఫ్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. స్టార్క్‌‌ ఫామ్‌ అనేది ఆసీస్‌ కు బారో మీటర్‌ వంటిది. మణికట్టు స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాపై భారీ అంచనాలున్నాయి. పూర్తిగా స్పిన్‌ వికెట్‌ ఎదురైతే అనుభవజ్ఞుడు నాథన్‌ లైయన్‌ తుది జట్టులోకి వస్తాడు. నాలుగేళ్ల కిందట టైటిల్‌ గెలిచిన జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇప్పుడు బరిలో ఉండటం కలిసొచ్చే అంశం.

బలహీనతలు

కచ్చితంగా అధిగమించాల్సిన బలహీనతలు ఆసీస్‌ కు లేకపోయినా..ఒకటి, రెండింటిపై మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భుజం గాయం వల్ల మూడునెలలు ఆటకు దూరంగా ఉన్న స్టార్క్‌‌.. 2018 నవంబర్‌ నుంచి వన్డే మ్యాచ్‌ ఆడలేదు. అలాగే స్టార్క్‌‌ మినహాకెరీర్‌ లో 50 వన్డేలు ఆడిన అనుభవం ఇతర పేసర్లకు లేదు. బౌలింగ్‌ లో జంపా పై ఎక్కువగా ఆధారపడటం. ఒకవేళ ఈ మణికట్టు స్పిన్నర్‌ మ్యాచ్‌ మధ్యలో వికెట్లు తీయకపోతే పేసర్లపై ఒత్తిడి పెరుగుతుంది. లీగ్‌ దశలో 9 మ్యాచ్‌ లు ఆడాల్సి ఉండటంతో రెండో వికెట్‌ కీపర్‌ లేకుండా టోర్నీకి వెళ్లడం లోటుగా కనిపిస్తున్నది.బాల్‌ టాంపరింగ్‌ కారణంగా స్మిత్‌ , వార్నర్‌ ను మానసికంగా దెబ్బతీయాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.