అటానమస్​ అంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నరు

అటానమస్​ అంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నరు

దోస్త్ లో నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూళ్లు
మైనారిటీ, కార్పొరేట్‍ కాలేజీల్లో బాహాటంగానే నడుస్తున్న వ్యవహారం

హైదరాబాద్‍, వెలుగు: ప్రైవేట్‍ డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను కాదని సొంతంగా ఫీజులను నిర్ణయించి విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారిని తమకు ‘అటానమస్‍’ హోదా ఉందని, ఫీజులను సొంతంగా నిర్ణయించే అధికారం మాకు ఉందని పేర్కొంటు బాహాటంగానే వసూలు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ, హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ డిపార్ట్ మెంట్‍ అధికారుల వద్ద ప్రస్తావిస్తే అసలు నగరంలో అటానమస్‍ ఉన్న ప్రైవేట్‍ కాలేజీలే లేవని తెలిపారు.  అటానమస్‍ పేరిట విచ్చలవిడిగా స్టూడెంట్ల దగ్గర ఫీజులను వసూలు చేస్తున్న కింగ్‍కోఠిలోని సెయింట్‍ జోసెఫ్‍ డిగ్రీ, పీజీ కాలేజీపై ఇటీవలే హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ డిపార్ట్ మెంట్‍కు ఫిర్యాదు చేసినట్లు ఫోరం ఎగనెస్ట్ కరెప్షన్‍ ప్రెసిడెంట్‍ విజయ్‍గోపాల్‍ తెలిపారు. అధిక ఫీజలు వ్యవహారంపై కొందరు విద్యార్థులను ప్రశ్నించగా తమకు తెలియదని, తమ పేరెంట్స్ ఫీజులను కట్టారని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు.

నాలుగురెట్లు అధికం

ప్రైవేట్‍ డిగ్రీ కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ ఆన్‍లైన్‍ అడ్మిషన్లను ‘దోస్త్’ ద్వారా చేపట్టింది. హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ నిర్దేశించిన ఫీజులను మాత్రమే ఆన్‍లైన్‍లో కట్టాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వెబ్‍సైట్‍లోనే సెల్ఫ్ ఫైనాన్స్ డ్‍ కోర్సులకు ట్యూషన్‍ ఫీజు, స్పెషల్‍ ఫీజు ఎగ్జామ్‍ ఫీజులను కాలేజీల వారీగా స్పష్టంగా పేర్కొంది. ఉదహారణకు సెయింట్‍ జోసేఫ్‍ కాలేజీలో బీబీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు ట్యూషన్‍ ఫీజు రూ.11వేలు, స్పెషల్‍ ఫీజు రూ.1000, ఎగ్జామ్‍ ఫీజు రూ.2855 మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ, హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ డిపార్ట్ మెంట్‍ నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సి ఉండగా ఒక్కో స్టూడెంట్స్ వద్ద రూ.35500 వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీకాం కంప్యూటర్‍ అప్లికేషన్‍ దోస్త్ ప్రకారం రూ.11090 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా కాలేజీ మేనేజ్‍మెంట్‍ సుమారు రూ.46300 ఫీజు వసూలు చేస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్‍ డిగ్రీ కాలేజీలు 257 వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 శాతం నగరం, నగర శివారులోనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో దాదాపు 38 కాలేజీల వరకు ప్రైవేట్‍ మైనారిటీ హోదాతో గుర్తింపు పొందిన డిగ్రీ కాలేజీలు నగరంలో ఉన్నట్లు హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ అధికారులు తెలిపారు. లిటిల్‍ ప్లవర్‍, సెయింట్‍ జోసెఫ్‍, సెయింట్‍ మేరీ, సెయింట్‍ ప్యాట్రిక్స్, లయోలా,  సెయింట్‍ గ్జావియర్‍, సెయింట్‍ ప్రాన్సిస్‍, సెయింట్‍ డెనియల్స్ తదితర కాలేజీలు వీటిల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిల్లో మెజారిటీ సీట్లు మైనారిటీ వర్గాలకు కేటాయించాలి. కానీ అలా జరగడం లేదు. పైగా తమకు అటానమస్‍ హోదా ఉందని చెప్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. వీటికి తోడు కార్పొరేట్‍ కాలేజీలోనూ అధిక ఫీజులున్నట్లు తమ విచారణలో తేలిందని ఫోరం ఎగనెస్ట్ కరెప్షన్‍ సంస్థ తెలిపింది. హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ డిపార్ట్ మెంట్‍, ఉస్మానియా వర్సిటీ అధికారులు కానీ వీటిని పర్యవేక్షించేందుకు సైతం టైం దొరకడం లేదు. ఫిర్యాదులు వస్తేనే వీటిపై తూతూ మాత్రంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతారని స్టూడెంట్స్ యూనియన్‍ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధిక ఫీజులను వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‍ చేస్తున్నారు.