
- 183 మంది బీజేపీ ఎంపీల ఆస్తులు 39 శాతంపైకి
- 36 మంది కాంగ్రెస్ ఎంపీల అసెట్లలో 48.76 శాతం పెరుగుదల
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడి
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తున్న 324 మంది ఎంపీల సగటు ఆస్తులు 43 శాతం పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తెలిపింది. ఈసారి కూడా పోటీచేస్తున్న ఆ ఎంపీల డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. ఏడీఆర్ వెల్లడించిన డేటా ప్రకారం.. 2019 ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఆ ఎంపీల సగటు ఆస్తులు రూ.21.55 కోట్లు ఉండగా.. గత ఐదేండ్లలో ఆ ఆస్తులు సగటున రూ.30.88 కోట్లకు చేరాయి. అంటే రూ.9.33 కోట్లు పెరిగాయి. అత్యధికంగా బీజేపీ నుంచి 183 మంది ఎంపీల సగటు ఆస్తులు 39.18 శాతం (రూ.18.40 కోట్ల నుంచి రూ.25.61 కోట్లకు) పెరిగాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 36 మంది ఎంపీలు ఉన్నారు. వారి సగటు ఆస్తులు 48.76 శాతం (రూ.44.13 కోట్ల నుంచి రూ.65.64 కోట్లు) పెరిగాయి. అలాగే 10 మంది డీఎంకే ఎంపీల ఆస్తులు 19.96 శాతం (రూ.30.93 కోట్ల నుంచి రూ.37.10 కోట్లు), ఏడుగురు శివసేన ఎంపీల ఆస్తులు 48.13 శాతం (రూ.19.77 కోట్ల నుంచి రూ.29.28 కోట్లు), ఐదుగురు సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ఆస్తులు 20.53 శాతం (రూ.20.56 కోట్ల నుంచి రూ.24.78 కోట్లు), ఎనిమిది మంది వైసీపీ ఎంపీల ఆస్తులు 84.13 శాతం (రూ.28.66 కోట్ల నుంచి రూ.52.78 కోట్లు) పెరిగాయి..
పోటీ చేస్తున్న పార్టీలు 104 శాతం వృద్ధి
2009 లోక్ సభ ఎన్నికల నుంచి 2024 లోక్ సభ ఎన్నికల వరకు పోటీచేస్తున్న పార్టీలు 104 శాతం పెరిగాయని ఏడీఆర్ తెలిపింది. ప్రస్తుత ఎన్నికల్లో 751 పార్టీలు బరిలో నిలవగా.. 2019లో 677 పార్టీలు పోటీచేశాయి. 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పార్టీలు పోటీచేశాయి.