హైదరాబాద్ లో SRH ఫైనల్ ఆడాలి : వార్నర్

హైదరాబాద్ లో SRH ఫైనల్ ఆడాలి : వార్నర్

IPL-12 సీజన్‌ లో SRH ఆఫ్‌ రేసు ఆశలను సజీవంగా నిలిపి, సొంత దేశానికి తిరుగు పయనమైన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాదీ వాసులకు, సన్‌ రైజర్స్‌ అభిమానులకు భావోద్వేగ మెసేజ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ టీమ్ ప్రాక్టీస్ లో భాగంగా సొంత టీమ్ తో కలవడానికి స్వదేశం వెళ్లిన వార్నర్‌ మంగళవారం ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు గుడ్‌ బై చెప్పాడు. ‘మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాది నేనున్న పరిస్థితిలో కూడా మీరు మద్దతుగా నిలిచారు. మళ్లీ సన్‌ రైజర్స్‌ కుటుంబంలో చేరడానికి, మీతో కలిసి ఆడటానికి.. మీ దగ్గరకు రావడానికి ఎంతో ఎదురు చూశాను.

ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా విభాగం, అభిమానులు నా రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్ కమ్ పలికారు. మీతో ఆడటం నేను ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో అంతా మంచే జరగాలని, మంచిఫలితం దక్కాలని ఆశిస్తున్నాను. హైదరాబాద్ లో జరిగే IPL ఫైనల్ లో SRH ఆడాలని కోరుకుంటున్నా ’ అని తెలిపాడు వార్నర్.  సోమవారం కింగ్స్‌ పంజాబ్‌ తో లాస్ట్ మ్యాచ్‌ ఆడిన వార్నర్‌ (56 బాల్స్ లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి సన్‌ రైజర్స్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలిపిన విషయం తెలిసిందే.