
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో బాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. తన నుండి సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. అతను హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘డ్రీమ్ గర్ల్’. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘డ్రీమ్ గర్ల్ 2’ వస్తోంది.
రాజ్ శాండిల్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కరమ్ వీర్ సింగ్‌గా, పూజగా డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు ఆయుష్మాన్. అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. జులై 7న చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్టు సోమవారం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పరేష్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు.