ఇల్లెందు ఎమ్మెల్యే తండ్రి భూ దందా

ఇల్లెందు ఎమ్మెల్యే తండ్రి భూ దందా
  • కాపాడాలంటూ బాధితుల దీక్ష
  • మద్దతు తెలిపిన బీజేపీ  జిల్లా అధ్యక్షుడు కోనేరు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ ​హరిప్రియ తండ్రి బాదావత్​ సీతారాములు భూ దందాలకు పాల్పడి పేదల నోట్లో మట్టి కొడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీ గ్రామపంచాయతీ ఆఫీస్​ఎదుట బాధితులు శుక్రవారం నిరసన దీక్షకు దిగారు. సీతారాములు నుంచి తమ స్థలాలను కాపాడాలంటూ ర్యాలీ తీశారు. వీరి ఆందోళనకు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ​కోనేరు సత్యనారాయణ, విద్యానగర్​కాలనీ సర్పంచ్​ గోవింద్​ సంఘీభావం తెలిపి మాట్లాడారు.  ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్ హరిసింగ్​అండతో సీతారాములు రెచ్చిపోతున్నాడన్నారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్​ తమ బంధువని చెప్పుకుంటూ దందాలు చేస్తున్నాడని ఆరోపించారు. మండలంలోని 137/1 నుంచి 139/9 వరకు ఉన్న సర్వే నంబర్లలోని దాదాపు 18 ఎకరాల భూమిని సీతారాములు ఆక్రమించుకున్నాడన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి, కోర్టుల్లో కేసులు వేస్తూ వేధిస్తున్నాడన్నారు. ఎవరైనా అడ్డు చెబితే ప్రైవేటు సైన్యంతో దాడులు చేయిస్తున్నాడని, ఇండ్లను కూల్చివేస్తూ భయపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ లీడర్లు కోనేరు నాగేశ్వరరావు, ఇతర లీడర్లు  పాల్గొన్నారు.