కింగ్‌డోవా (చైనా): ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించినా.. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఓటమి తప్పలేదు. గురువారం జరిగిన గ్రూప్–వై రెండో మ్యాచ్‌లో ఇండియా 2–3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడింది. అయినప్పటికీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో తన్వీ 21–14, 17–21, 21–18తో వరల్డ్ 16వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్‌పై గెలిచింది.
డబుల్స్‌లో గాయత్రి–ట్రీసా జోలీ 21–14, 20–22, 21–11తో టిడాప్రాన్ క్లీబ్యీసున్–నట్టమోన్ లైసువాన్‌పై నెగ్గారు. మరో మ్యాచ్‌లో రక్షిత రామరాజ్ 19–21, 17–21తో పిచమోన్ ఒపనిపుత్ చేతిలో, డబుల్స్‌లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా 21–19, 14–21, 15–21తో మిజాద్–తుంగ్‌సటాన్ చేతిలో, మాళవిక బన్సోద్ 18–21, 14–21తో పోర్నిచా చేతిలో ఓడింది. మెన్స్ గ్రూప్–సి మ్యాచ్‌లో ఇండియా 2–3తో జపాన్ చేతిలో ఓడినా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఆయుష్ షెట్టి, సాత్విక్–చిరాగ్ జోడీ విజయాలు సాధించగా.. హెచ్.ఎస్. ప్రణయ్, హరిహరన్–పృథ్వీ, తరుణ్ మానేపల్లి ఓటమిపాలయ్యారు.
